మాజీ స్పీకర్ , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పోచారం నివాసానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి పోచారంతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 13మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోన్న వేళ పోచారంతో రేవంత్ భేటీ ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ కు పోచారం అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపినా కేసీఆర్ పట్టుబట్టి మరీ ఒప్పించారు. నిజామాబాద్ లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ కొనసాగినా సొంత చరిష్మాతో బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై ఫోకస్ పెట్టిన అధికార పార్టీ.. కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేత పోచారాన్ని మొదట పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
అందులో భాగంగానే మంత్రి పొంగులేటితో కలిసి ఉదయం పోచారం నివాసానికి రేవంత్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ ఆహ్వానించినట్లు సమాచారం. గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన అనుభవం ఉండటం, మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ ఆహ్వానంపై పోచారం సానుకూలంగా స్పందించారని అంటున్నారు.