మే 12, 1998 న భారత్ జరిపిన పొఖ్రాన్ అణు పరీక్ష ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ అణుపరీక్ష కై అన్ని ఏర్పాట్లను అత్యంత గోప్యంగా ఉంచి, దిగ్విజయంగా బుద్ధ పూర్ణిమ రోజున, రాజస్థాన్ ఎడారులలో జరిపిన ఈ అణుపరీక్ష చూసి దేశ దేశాల నిఘా వర్గాలు దిగ్భ్రాంతి చెందాయి. తమ నిఘా కంటికి దొరకకుండా ఈ ఏర్పాట్లు అన్ని వీరు ఎప్పుడు చేసుకున్నారో అంటూ అమెరికా నిఘా వర్గాలు బహిరంగంగానే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. అప్పటి డి. ఆర్. డి. ఓ హెడ్ అబ్దుల్ కలాం నేతృత్వంలో ఈ అణు పరీక్షలు జరిగాయి.
1996 లో పీవీ నరసింహ రావు ప్రధాని పీఠాన్ని వాజపేయికి అందించి తప్పుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో, దేశ భద్రత, రక్షణకి సంబంధించిన కొన్ని విషయాలపై విలేకర్లు ఆయన్నేవో ప్రశ్నలేస్తే, ‘ఆ వివరాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పాను. మీకు చెప్పనవసరం లేదు’ అన్నాడు క్లుప్తంగా. దాని అర్థం ఏమిటి అన్నది విలేకరు లతో సహా ఎవరికీ అప్పుడు పెద్దగా అర్థం కాలేదు. కానీ 19 98 లో పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిగిన తర్వాత వాజ్‌పేయిని విలేకరులు ఇంటర్వ్యూ చేస్తుండగా, ఆయన ఇచ్చిన సమాధానం తన స్వంత పార్టీని నివ్వెరపరిచింది. పోఖ్రాన్ అణు పరీక్షల వెనుక మాస్టర్ మైండ్ మొత్తం పి. వి. నరసింహారావు దేనని ఆయన పదవి దిగిపోతూ, తనకు పోఖరాన్ అణు పరీక్షల గురించిన అత్యంత వివరమైన ప్లాన్ అందించి వెళ్లాడని, తాము దాన్ని కేవలం అమలు చేశామని చెప్పుకొచ్చారు. పీవీ నరసింహ రావు ప్రధాని పీఠం నుంచి తప్పుకున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకి అర్థం అప్పుడు తెలిసింది అందరికీ.
ఇప్పుడు చెప్పండి అలాంటి రాజనీతిజ్ఞులైన రాజకీయ నాయకులు మనకు ఇప్పుడు ఉన్నారా? పదవి నుంచి దిగిపోయాక కూడా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడికి పూర్తి వివరాలు అందించి, దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసి, దానికి సంబంధించిన “క్రెడిట్” కోసం ఏమాత్రం ప్రాకులాడకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయిన పి. వి. నరసింహారావు కానీ, యావత్ దేశం, స్వంత పార్టీ తనను పొగుడుతూ, తాను అమలు చేసిన అణు పరీక్షలను ప్రశంసిస్తూ ఉండగా, దీనికి సంబంధించిన మాస్టర్ మైండ్ మొత్తం అవతలి పార్టీకి చెందిన పీవీ నరసింహారావు దేనని ఎంతో హుందాగా స్పందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి కానీ – ఇప్పటి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ఆదర్శం. ప్రత్యర్థి పార్టీల రాజకీయ నాయకులను ఆగర్భ శత్రువులుగా, ఆజన్మ విరోధులుగా చూస్తూ, వారిని, వారి పార్టీలని, వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుకి ఈడ్చే ప్రస్తుత తరం రాజకీయ నాయకులు ఈ ఇద్దరు రాజనీతిజ్ఞుల నుంచి ఎంతోకొంత నేర్చుకుంటే అదే పదివేలు!
-జురాన్ (@CriticZuran)