పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా ఇంజినీరింగ్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఎంత ఇష్టమైన కంపెనీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏపీలో ఉన్న ప్రతి ఇసుక రేణువుపైనా హక్కును పొందిన జేపీ పవర్ వెంచర్స్ లింకులు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైనవే. అయితే ఇప్పుడు ఈ రెండు కంపెనీలు పోట్లాడుకుంటున్నాయి. మాకు ఉచిత ఇసుక కావాలనిమేఘా అంటే.. డబ్బులిస్తే తప్ప ఇవ్వబోమని జేపీ సంస్థ తేల్చేసింది. దీంతో పోలవరం పనులు ఆగిపోయాయి.
రివర్స్ టెండింరింగ్‌లో భాగంగా 2019లో మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరాకు హామీ ఇచ్చిందని మేఘా సంస్థ చెబుతోంది. ఇంత కాలం పోలవరంకు అవసరమైన ఇసుకను ఉచితంగానే తీసుకుంటోంది. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు ఇచ్చింది. ఆ సంస్థ ఇప్పుడు మేఘా సంస్థకు ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. డబ్బు చెల్లించాలని కోరుతోంది. గత ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. ఈ కారణంగా గత ప్రభుత్వంలో పనులు చేసిన నవయుగ సంస్థకు ఇసుక ఇబ్బందులు ఎదురు కాలేదు.
ఏపీలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. పోలవరం హెడ్‌వర్క్స్ ప్రాజెక్ట్ లో మిగిలిన పనులుతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కలిపి రూ.4,359.11 కోట్లకు పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత వారంలోపే గతంలో ఇసుక ఉచితంగా వచ్చేదని, ఇప్పుడు తన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని, దీనికి జీఎస్టీ అధికం అని, ఇది టెండర్ డాక్యుమెంట్ పరిధిలోకి రాని పని అని, అందుకే అదనంగా 500 కోట్లు ఇవ్వాలని మేఘా లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అయినా ఇప్పుడు ఉచిత ఇసుకను మేఘా ఎలా తీసుకుంటుందో.. అధికారవర్గాలకూ అంతుబట్టని విషయం. ఈ పంచాయతీ సీఎం దగ్గరే తేలే అవకాశం ఉంది. రెండు కంపెనీలు ఆత్మీయమైనవే కావడంతో సీఎం సులువుగానే పరిష్కరించే అవకాశం ఉంది.