పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా ఏర్పడిన లోపాలను సవరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులను పిలిపించారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చారు. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. రెండ్రోజుల పాటు ప్రాజెక్టు ఆసాంతం పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని ఆమూలాగ్రం పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది. ఆ తర్వాత రెండ్రోజుల పాటు మేధోమథనం చేయనున్నారు.
పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే శరణ్యమని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. పోలవరంలో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరు నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, సివిల్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, జియో టెక్నికల్ ఇంజినీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నారు.
ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రం వాల్ విధ్వంసం పరిశీలన, అగాధాలు, అక్కడ భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణులు ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. నిపుణులు ఇచ్చే సూచనలే కీలకం కానున్నాయి. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమనందున ఇప్పటికిప్పుడు పనులు చేపట్టలేదు. నిపుణులు ఇచ్చే నివేదికలు ఆధారంగా వర్షకాలం ముగియగానే… పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.