పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ.. నవయగ.. మరో రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేసి కొత్త గిన్నీస్ రికార్డును సృష్టించింది. 24 గంటల పాటు నిర్విరామంగా.. పనులు జరిగాయి. నిజానికి.. గిన్నీస్ రికార్డును… 16 గంటల్లోనే అధిగమించింది. 2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఇప్పటి వరకూ అదే రికార్డుగా ఉండేది. ఇప్పుడు పోలవరంలో.. ఈ రికార్డును 16 గంటల్లోనే అధిగమించారు.
అత్యంత వేగంతో పని చేస్తున్నందున నాణ్యత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రికార్డు సాధనకు 3,600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది పనిచేశారు. 2 లక్షల బస్తాల సిమెంటు, 40 క్యూబిక్ మీటర్ల మెటల్, 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కాంక్రీటులో కలపడానికి 200 టన్నుల యార్డ్ మిక్చరు ఉపయోగించారు. కాంక్రీటును స్పిల్ చానల్‌కు తరలించడానికి 70 ట్రాన్సిక్ మిల్లర్లు, 20 ఎడిటర్లు, 20 డంపర్లు, 5 టెలిబెల్టులు ఉపయోగించారు. ఈ మొత్తం పనుల ప్రక్రియను .. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గిన్నిస్ రికార్డును.. మధ్యాహ్నం.. గిన్నిస్ ప్రతినిధుల చేతుల మీదుగా అందుకోనున్నారు. నిడదవోలులో జన్మభూమి సభలో పాల్గొని… మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను ఆయనే అందుకుంటారు. రైతులు, ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఏపీ జీవనాడిగా పేర్కొంటున్న.. పోలవరంలో.. స్పిల్ వే చానల్ పనులు.. అత్యంత వేగంగా పూర్తి అవుతున్నాయి. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వానికి స్పిల్ వే చానల్ పనులు వేగంగా పూర్తి కావడం సంతోషాన్నిస్తోంది.