ఇవాళ్టి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్రం అధ్యయనం చేస్తుందని భాజపా నాయకుడు సుజనా చౌదరి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి ఆటంకాలు లేవంటారు, కావాల్సినన్ని నిధులున్నాయంటారు, నిర్మాణ బాధ్యతలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయంటారు! అలాంటప్పుడు ఇంకా అధ్యయనం చేయాల్సింది ఏముంది..? ప్రాజెక్టు మీద కేంద్రానికి అంత క్లారిటీ ఉన్నప్పుడు… ఎందుకింత ఆలస్యం? భాజపా నాయకుల్లోనే ఎందుకంత గందరగోళం..? అసలు పోలవరంపై సుజనా చౌదరి ఒకటి చెబుతుంటే, మరో కేంద్రమంత్రి మరోలా, ఇంకో భాజపా నేత ఇంకోలా ఎందుకు వ్యాఖ్యానిస్తుంటారు..? పోలవరం జాతీయ ప్రాజెక్టే కదా, కానీ జాతీయ పార్టీకి చెందిన నేతల మధ్య ఎందుకీ విభిన్న అభిప్రాయాలు..? చూస్తుంటే ఇది భాజపా వ్యూహాత్మక గందగోళంగానే కనిపిస్తోంది.
భాజపా ఇన్ ఛార్జ్ సునీల్ దేవ్ రా ఆ మధ్య ఏమన్నారు… పోలవరంలో భారీ అవినీతి జరిగింది, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లాల్సిందే అన్నారు. జల్ శక్తి మంత్రి షెకావత్ ఏమన్నారు… కాంట్రాక్టర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కాదన్నారు! ఇక, ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఏమన్నారు… చంద్రబాబు నాయుడుకి పోలవరం ప్రాజెక్టు ఒక సొంత బ్యాంకులా తయారైందనీ, ఆయనకు ఎప్పుడు కావల్సివస్తే అప్పుడు సొమ్ము తీసుకోవడానికే అంచనాలు పెంచేశారని ఆరోపించారు. రాష్ట్ర నేతలు కన్నా, వీర్రాజు, పురంధేశ్వరి… వీళ్లకీ పోలవరం మీద ఎవరి వెర్షన్ వారికి ఉంది. ఇంతకీ… పోలవరం విషయంలో ఎవరి వెర్షన్ కరెక్ట్..? కేంద్రమంత్రి షెకావత్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, ఆయన ఏపీలో జగన్ సర్కారు వైఖరిని వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నారు. సుజనా చౌదరేమో జగన్ సర్కారు వైఖరిని తప్పుబడుతున్నారు. చంద్రబాబుదే తప్పంతా అని చెప్పిన మోడీ… వైకాపా అధికారంలోకి రాగానే గత టీడీపీ సర్కారు ప్రతిపాదించిన అంచనాల ప్రకారమే నిధులను విడుదల చేశారు. సొమ్ము చేసుకోవడం కోసమే అంచనాలు పెంచారని గతంలో ఆయనే స్వయంగా చేసిన విమర్శలు, ఇప్పుడు తప్పు అని మోడీ చెప్తున్నట్టా..?
పోలవరం మీద భాజపా వైఖరి చూస్తుంటే… దీన్ని పూర్తిగా నాయకుల అస్పష్టతగా కొట్టి పారేయలేం. ఎందుకంటే, పార్టీ జాతీయ నాయకత్వం మార్గదర్శకాలు లేకుండా భాజపాలో ఏ నాయకుడూ ఇలా తోచిన విధంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇది భాజపా వ్యూహాత్మమే అనిపిస్తోంది. ఎందుకంటే, భాజపా దృష్టిలో సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు దాదాపు ఒకటే. భవిష్యత్తులో ఎవరి అవసరం వస్తుందో వారికి తెలీదు! ఏదో ఒక పార్టీని దగ్గరకి చేర్చుకుని రాసుకుపూసుకు తిరగాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు భాజపాకి లేదు. భవిష్యత్తులో అవసరాలు మారొచ్చు. అందుకే, ఏపీలో వైకాపా విధానాలను సమర్థిస్తోందా, టీడీపీ విధానాలను విమర్శిస్తోందా అనే సందిగ్ధతను ఇలాగా కొనసాగించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైకాపా మీద భాజపా ఎన్ని విమర్శలు చేసినా… జగన్ స్పందించే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు భాజపాతో పోరాటం అని దూకుడు ప్రదర్శించిన టీడీపీ… ఓటమి తరువాత ఆ పార్టీ మీద విమర్శలు చేయడం లేదు. కాబట్టి, భాజపాకి ఏపీలో ఉండాల్సిన అండ్వాటేజ్ ను అలాగే ఉంచుతూ కాలం గడపొచ్చు. కాబట్టి, పోలవరం ప్రాజెక్టు మీద ఓసారి జగన్ సర్కారు వైఖరి తప్పుబడుతూ, మరోసారి వెనకేసుకొస్తూ… ఓసారి గత చంద్రబాబు సర్కారును విమర్శిస్తూ, మళ్లీ నాటి ప్రభుత్వ ప్రతిపాదనలే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ కాలక్షేపం చేయాలన్నది భాజపా రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.