అధికారంలోకి వచ్చాం.. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఏడాది..రెండేళ్లు.. మూడేళ్లు..నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇంకా కాలేదు. ఇప్పుడు మరో రెండేళ్లు కావాలంటున్నారు. ఇదీ ప్రభుత్వ పని తీరు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న పనుల్ని రివర్స్ టెండర్ల పేరుతో ఆపేశారు. అత్యంత భారీ యంత్రాలతో సాగుతున్న నిర్మాణ పనుల్ని నిలిపివేసి కాంట్రాక్టర్ ను తరిమేశారు. తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో డ్రామాలేసి… మేఘాకు కట్టబెట్టారు. అప్పట్నుంచి రెండు, మూడు శాతం పనులు జరిగితే ఒట్టు.
ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలంటే… ఓ ఏడాది పనులు ఆగితేనే బడ్జెట్ రెట్టింపు అయిపోతుంది. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పనులు ఐదేళ్లు ఆగిపోతే… ఎంత వ్యయం పెరుగుతుంది. అతి తక్కువకు కడతానని రివర్స్ టెండర్లేసి తీసుకున్న మేఘా పూర్తిగా చేతులెత్తేసింది. పనులు చేయలేకపోతోంది. గత ప్రభుత్వం ఒక్క రోజు పనులు ఆగిపోతే రూ. ఐదు కోట్ల భారం పడుతుందన్న భయంతో పనుల్ని పరుగులు పెట్టించేది. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఇంకా రెండేళ్ల సమయం అంటూ టైం పాస్ చేస్తున్నారు.
చేతకాని పాలన.. . కక్ష సాధింపు మైండ్ సెట్… కమిషన్ల కక్కుర్తి ఇలా మొత్తం కలగలిపి.. ఏపీ జీవనాడిని పూర్తి స్థాయిలో చిదిమేశారు. ఇపపుడు తొలి దశ అంటూ….. భారీ ప్రాజెక్టు అంటూ చిన్న రిజర్వాయర్ స్థాయికి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత దారుణంగా నష్టం చేసిన పాలకులు గతంలో ఎవరూ లేరు. ఇక ముందు రాకపోవచ్చు కూడా !