ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఏడాది నుంచి ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. కొత్త ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ మార్పు విషయంలో జరిగిన రచ్చ కారణంగా.. పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత పనులు ప్రారంభమైనా… నిధుల సమస్య వెంటాడిదింది. కేంద్రం రీఎంబర్స్ చేసిన నిధులను రాష్ట్రం ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కొత్త కాంట్రాక్టర్ మేఘా ఇంజినీరింగ్‌కు.. ప్రభుత్వం గత మార్చిలోనే బిల్లులు కొంత మేర ఇచ్చింది. దాంతో పనులు ఊపందుకుంటాయనుకున్న సమయంలో.. లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పనులు సాగడం లేదు. కూలీలు అందరూ అక్కడే ఖాళీగా ఉన్నారు. ఇంత కాలం ఎప్పుడు పనులు ప్రారంభం అయితే.. అప్పుడు చేసుకుందామనుకున్న కూలీలు.. తాజాగా.. అందరూ.. స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా వలస కూలీలంతా.. తమ తమ గ్రామాలకు వెళ్లిపోయే పనిలో ఉన్నారు. పోలవరం దగ్గర కూడా అంతే. కొంత మందిని ఇప్పటికే పంపించేశారు. మరికొంత మంది ఉన్నారు. వారు కూడా.. తాము స్వస్థలాలకు వెళ్తామని పట్టుబడుతున్నారు. దీంతో పనులు సాగడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి పోలవరం పనులు ఏడాది మొత్తం సాగవు. వర్షకాలం ఆరు నెలల పాటు పనులు సాగడానికి అవకాశం ఉండదు. ఆరు నెలలు మాత్రమే పనులు చేయగలరు. ఈ ఆరు నెలల కాలంలో పనులు జరగలేదు. మళ్లీ వర్షాకాలం వచ్చేస్తోంది. దీంతో.. మళ్లీ నవంబర్ వరకూ.. పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొసమెరుపేమిటంటే.. పోలవరం డయాఫ్రమ్ వాల్ గ్యాప్-1 డిజైన్లకు కేంద్ర జలసంఘం నిన్ననే ఆమోదం తెలింపి.. పనులు ప్రారంభించాలని కాంట్రాక్ట్ సంస్థకు సమాచారం పంపింది. కానీ అక్కడ ఆ వాతావరణం లేదు.