పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ ఏడాదే గ్రావిటీ ద్వారా నీరిస్తామని.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత… అక్కడ పర్యటనకు వెళ్తే.. అధికారులు.. రెండేళ్లు పడుతుందని చెప్పారు. ఇప్పుడు.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ.. మూడేళ్లు పడుతుందని…తేల్చేసింది. నిజంగా పూర్తయ్యే సరికి.. పదేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తున్న జలవనరుల నిపుణులకు అర్థం అవుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తుది అంచనాల వ్యయం 55 వేల 478 కోట్ల రూపాయలకు కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా మండలి ఆమోదం తెలిపిందని, కానీ జలవనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని మరో కమిటీ ఆమోదం తెలపాల్సి ఉందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెబుతోంది. ఆ అంచనాలు వస్తేనే.. అసలు ఆమోదం తెలిపినట్లని చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు అంటే 2014 మార్చి 31వ తేదీ వరకు పోలవరంపై ప్రభుత్వం వ్యయం చేసిన నిధులకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఇస్తేనే తిరిగి చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్ణయిచింది. పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం రివర్సింగ్ టెండరింగ్ కు వెళ్తున్నట్టు తమకేటువంటి సమాచారంలేదని, అటువంటి అంశాలు, ప్రతిపాదనలు తమ పరిధిలోకి రావని పీపీఏ చెబుతోంది. అయితే కొత్తగా టెండర్లు పిలిచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందంటున్నారు. కాపర్ డ్యామ్ పనులు నత్తనడకన సాగుతున్నందున.. కార్యాచరణ ప్రణాళికను ఇవ్వాలని ప్రాజెక్ట్ అథారిటీ.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్ల సమయం పడుతుందని పీపీఏ నిర్ధారించింది.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పనులు.. దాదాపుగా ఆగిపోయాయి. గోదావరికి వరద వస్తే.. సాధారణంగా.. పనులు నిలిపి వేస్తూంటారు. ఈ సారి వరద రాకుండానే పనులు నిలిపివేశారు. కేంద్రం కూడా.. ఈ ప్రాజెక్ట్ పై.. అనేక.. కొర్రీలు పెడుతోంది. నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నయి. ఇప్పుడు సర్కార్ కూడా.. రివర్స్ టెండరింగ్ అంటోంది కాబట్టి.. మొత్తానికి.. నిర్మాణలక్ష్యానికి గండిపడినట్లేనన్న అభిప్రాయం.. నిపుణుల్లో వ్యక్తమవుతోంది.