పోలవరం ప్రాజెక్ట్ పనులు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కనున్నాయి. ఒకే రోజు రికార్డు స్దాయిలో కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించడానికి ప్రభుత్వం, కాంట్రాక్టు ఏజెన్సీ నవయుగ పనులు ప్రారంభించింది. ఈ పనులను.. పరిశీలించడానికి గన్నిస్ ప్రతినిధులు కూడా వచ్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 24గంటల్లో 28వేల క్యూబిక్ మీటర్ల పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ నిరంతరాయంగా కాంక్రీట్ పని జరగనుంది. రికార్డును అధిగమించినా, పనులు ఆపకుండా కొనసాగించాలని నవయుగ కంపెనీ నిర్ణయించింది. నిర్విరామంగా 30 నుంచి 35 గంటల పాటు ఈ కాంక్రీటు వేసే పనిని చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఎంత పని పూర్తయితే, అంత పని రికార్డుగా మలిచే యోచనలో కంపెనీ ప్రతినిధులు, పోలవరం ఇంజనీర్లు ఉన్నారు.
పోలవరంలో ప్రస్తుతం నవయుగ కంపెనీకి చెందిన ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సుమారు నాలుగువేల మంది పని చేస్తున్నారు. వీరు కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కు సంబధించి ఇతర ఇంజనీర్లు సుమారు 15 వందల నుంచి 2వేల మంది ఈ గిన్నిస్ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. పని పూర్తయ్యాక, రెండు గంటల వ్యవధిలోనే గిన్నిస్ బుక్ ప్రతినిధులు అక్కడికక్కడే ఈ రికార్డును ధృవీకరిస్తారు. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ను కంపెనీ ప్రతినిధులకు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు.
ప్రస్తుతం ప్రపంచం రికార్డు దుబాయ్ లోని రాల్స్ కాంట్రాక్టింగ్ అండ్ అల్ఫా ఇంజనీరింగ్ కంపెనీ పేరు మీద ఉంది. ఈ కంపెనీ 2017 మే నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 35 గంటల 19 నిమిషాల వ్యవధిలో 21 వేల 580 క్యూబిక్ మీటర్ల పని చేసింది. దుబాయ్ లో ఓ భారీ భవన నిర్మాణానికి సంబంధించి ర్యాఫ్ట్ ఫౌండేషన్ కోసం ఈ వర్క్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసి, కొత్త రికార్డు సృష్టించడానికి పోలవరం ప్రాజెక్టు వేదికగా నవయుగ కంపెనీ సిద్దమయ్యింది.