పోలవరం ప్రాజెక్ట్ కలగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రెండు రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం చెబుతున్న మాటలు అంతే ఉన్నాయి. రెండేళ్ల కిందట డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. ఆ డయాఫ్రంవాల్ను ఎలా బాగు చేయాలో ఇంజనీర్లకూ అర్థం కావడం లేదని ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేస్తున్నారు. పరిస్థితి చూస్తే పోలవరాన్ని లైట్ తీసుకునేదుకు ఈ గుంతను కారణంగా ప్రభుత్వం చూపేందుకు రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
డయాఫ్రం వాల్ వద్ద పడిన గుంతకు కారణం చంద్రబాబేననే వింత వాదనను ఇప్పటికే తెరపైకి తీసుకు వచ్చారు. రెండేళ్ల నుంచి పనులు సాగకపోవడంతో అక్కడ ఈ పరిస్థితి ఏర్పడిందని సకాలంలో పనులు సాగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని టీడీపీ నేతలు అంటున్నారు. అత్యంత వేగంగా సాగుతున్న పోలవరం పనుల్ని వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘాకు అప్పగించారు. కానీ పనులు మాత్రం సాగడం లేదు. అతి కష్టం మీద ఒకటిన్నర శాతం పనులు చేశారు. ఇప్పుడు డయాఫ్రం వాల్ పనులు ఎలా చేయాలో మేఘాకు అర్థం కావడం లేదు.
పోలవరాన్ని పూర్తి చేస్తామని తొడలు కొట్టి సవాల్ చేసిన మంత్రులు మాజీలయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టినమంత్రికి… పులిచింతల గోదావరి మీద ఉన్నదని.. డయాఫ్రంవాల్ అన్ని ప్రాజెక్టులకూ ఉంటుందని వింత వింత సమాధానాలు చెబుతూ..భవిష్యత్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. పరిస్థితి చూస్తే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు పెద్ద బొక్క పడిందని..ఆ ప్రాజెక్టును అలా వదిలేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.