పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. యాభై వేల కోట్లు ఖర్చు భరించడం కష్టమన్న అంచనాకు వచ్చిన కేంద్రం ఎత్తు తగ్గింపు ప్రతిపాదనపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎవరు ప్రతిపాదనలు పంపారో తెలియదు కానీ.. కేంద్ర జలశక్తి శాఖకు స్పష్టమైన ప్రతిపాదనలు అందాయని .. దీనిపై పరిశీలన జరుగుతోందని మీడియాకు సమాచారం లీక్ చేశారు. బహుశా.. ఈ వివరాలు ఏపీ సర్కార్ నుంచి అంది ఉంటాయని చెబుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలంటే డిజైన్లు మార్చాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిజైన్లు మార్చడం అసాధ్యం. అందుకే.. నీటి నిల్వ నిర్ణయాలతోనే… ఎత్తు తగ్గింపు నిర్ణయాలను పరిమితం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలా అయితే మొత్తం కట్టామని చెప్పుకోవడానికి.. ప్రజలను మభ్యపెట్టడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 150 అడుగులు. కనీస నీటిమట్టం 135 అడుగులు. కనీస నీటి మట్టం నిల్వ ఉంచితే..1,36,500 ఎకరాలకు పరిహారం చెల్లించాలి. లక్షకుపైగా కుటుంబాలు నిర్వాసితులవుతాయి. ఇలా చేస్తే ప్రాజెక్ట్ ఖర్చు రూ. యాభై వేల కోట్లవుతుంది. దీన్ని భరించడం కష్టమవుతుంది. అంతే.. కనీస నీటి మట్టాన్ని మూడు మీటర్లకన్నా ఎక్కువగా తగ్గిస్తే చాలన్న అభిప్రాయం.. ఎత్తు తగ్గింపు ప్రక్రియలో పాలు పంచుకుంటున్న నిపుణుల్లో వ్యక్తమవుతోంది. భూసేకరణ వ్యయం సగానికి సగం తగ్గిపోతుంది. ఖర్చు తగ్గించుకోవడానికి ఇంత కంటే గొప్ప మార్గం లేదన్నది కొంత మంది నిపుణుల అభిప్రాయం.
అయితే ఎత్తు తగ్గిస్తే డిజైన్లు మార్చాల్సి ఉంటుంది. గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్ సిద్ధం చేశారని ఇలాంటి సమయంలో ఎత్తు తగ్గింపు సాధ్యం కాదని కేంద్ర జల సంఘం అంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్రం తల్చుకుంటే డిజైన్ మార్చడం పెద్ద విషయం కాదు. ఏపీ సర్కార్ కూడా నోరు తెరిచే పరిస్థితి లేదు. దీంతో పోలవరం ఎత్తు తగ్గింపు ఖాయమన్న చర్చ నడుస్తోంది. కేంద్రం ధైర్యంగా అడుగులేస్తే… డిజైన్లలోనే మార్పు వస్తుంది లేకపోతే.. నీటి నిల్వలోనే ఎత్తును తగ్గిస్తారు. ఎలా అయినా పోలవరంకు మాత్రం మూడిందని స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇప్పటికే పోలవరం ఎత్తు తగ్గిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. జగన్ అంగీకరించారన్నారు. తర్వాత కేంద్రం పోలవరం అంచనాలకు కోత వేసినప్పుడు ఏపీసర్కార్ అదే ఆలోచన చేసిందని చెప్పుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. చివరికి అదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పోలవరం ఎత్తు తగ్గిస్తే.. ఓ సాధారణ బ్యారేజీగా మారిపోతుందని రాయలసీమకు నీళ్లు అందవన్న ఆందోళన… ఏపీ సాగునీటి రంగాల నిపుణుల్లో వ్యక్తమవుతోంది.