పోలవరం ఏపీకి జీవనాడి. ఎత్తు తగ్గిస్తే ఎందుకూ పనికి రాదని అలాంటి పనులకు అంగీకరించవద్దని వైఎస్ ఆత్మ అయిన కేవీపీ నేరుగా లేఖలు రాసినా సీఎం జగన్ కు.. కనీసం చీమకుట్టినట్లుగా కూడా లేదు. తొలి దశ పేరుతో కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదే విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించేసింది. పోలవరంకు తొలి దశ.. రెండో దశ అనేవే లేవు. అయినా ఇప్పుడు తొలి దశ అనే ప్రకటన చేసి 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చేసింది.
తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేస్తామని ఇలా నీటిని నిల్వ చేసే వరకే సహాయ, పునరావాసం ఇస్తామని తేల్చేసింది. స్వయంగా వైసీపీ ఎంపీ ప్రశ్న అడిగి మరీ ఈ సమాధానం చెప్పంచారు. తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికీకేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు
పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,13,119 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మొత్తం ఎకరాలకు పరిహారం ఇస్తేనే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 45.72 మీటర్ల ఎత్తు ప్రాజెక్టు ఉంది. పోలవరం రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు 30 వేల కోట్లు అవసరమవుతాయి. ఇవి ఇవ్వడానికి ఇష్టం లేక పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్ స్థాయికి దింపేశారు. పార్లమెంట్లో సమాధానం ఇచ్చిన కాసేపటికే సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. కానీ కేంద్రం చెప్పిన అంశంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. సరి కదా పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల పాటు పోలవరంను ఆపేసి.. ఇప్పుడు మరో పద్దెనిమిది నెలలని చెబుతున్నారు. కానీ ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి.