ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ విషయంలో… కేంద్రాన్ని.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది. కాంట్రాక్టుల రద్దుపై పునరాలోచించాలని.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశంలో… కేంద్ర ఉన్నతాధికారులు స్పష్టమైన సూచన చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తమకు కాంట్రాక్టులు రద్దు చేసే అధికారం ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని చేతల్లో చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నెల పదిహేడో తేదీనే… ఇంకా మిగిలి ఉన్న పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులు, హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశంలో… ఏపీ ప్రభుత్వానికి పీపీఏ నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. సవివరమైన నివేదిక ఇవ్వాలని పీపీఏ సూచించింది. నిజానికి పోలవరంకు సంబంధించి ఎలాంటి ముందడుగు వేయాలన్నా.. పీపీఏ ద్వారానే జరగాలి. లేకపోతే.. కేంద్రం నిధులు మంజూరు చేయలేదు. వంద శాతం నిధులు ఇచ్చేది .. కేంద్రమే కాబట్టి.. ప్రతీ పని.. కేంద్రం అనుమతితోనే జరగాలి. కానీ.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. ఏకపక్షంగా వెళ్తోంది. తమకు అధికారం ఉందని వాదిస్తూ.. కాంట్రాక్టులను రద్దు చేసింది. టెర్మినేషన్ ప్రక్రియ పూర్తయి కాక ముందే.. టెండర్లు కూడా పిలిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పోలవరం ప్రాజెక్ట్ అధికారులను సైతం నివ్వెర పరుస్తోంది. నిబంధనలు పాటించకుండా… ప్రభుత్వం ఇంత అసాధారణ రీతిలో.. నిర్ణయాలు తీసుకుంటూ… పీపీఏను.. పట్టించుకోనట్లుగా వ్యవహరించడం… అధికారులను కూడా విస్మయపరుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పాత కాంట్రాక్టర్లు నవయుగ, బెకం కంపెనీల పనితీరుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే.. ఈ అడుగులేమిటని.. కేంద్ర ఉన్నతాధికారులు కూడా విస్మయానికి గురవుతున్నారు. గతంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనులు చేయలేక చేతులెత్తేసినప్పుడు..అప్పటి సీఎం చంద్రబాబు… 60సీ కింద నోటీసులు ఇచ్చి.. కొత్త టెండర్లను ఆహ్వానించారు. కానీ.. కేంద్రం నిలిపి వేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ నేరుగా.. కాంట్రాక్టర్లను తీసేసి.. కొత్త టెండర్లను పిలుస్తోంది. పైగా.. కేంద్రం అంటే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో.. రివర్స్ టెండరింగ్ పై.. కేంద్రం ఏం చేయబోతోందననే ఆసక్తి అంతటా ఏర్పడింది.