నారా చంద్రబాబు నాయుడు సర్కారుకు మరో టెన్షన్ మొదలైంది! వచ్చే ఎన్నికల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నీరు అందించాలని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయనే ఆందోళన ఈ మధ్య ఎక్కువైంది. ప్రతీవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వర్చువల్ ఇన్ స్పెక్షన్ కూడా చేస్తున్నారు. దీన్లో అధికారులతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. వారందరికీ ముఖ్యమంత్రి సూచనలూ సలహాలు ఇస్తున్నారు. ఇంకోపక్క నిధుల విషయమై కూడా కేంద్రంతో ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయినాసరే, క్షేత్రస్థాయి పనుల్లో ఆశించిన పురోగతి సాధించడం లేదన్న స్పష్టతకు ప్రభుత్వమే వచ్చేసింది. దీంతో పోలవరం పనుల చేస్తున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైపోయింది.
నిజానికి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ పోలవరం నిర్మిస్తున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కొంత అసంతృప్తి ఉంది. పనులు వేగంగా చేయడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే చాలా సమీక్షల్లో చాలా అవకాశాలు ఇచ్చినా కూడా ఆ కంపెనీ పనితీరులో మార్పు రాకపోడంతో ఈ మధ్యనే 60 సి కింద నోటీసులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. పనులు ఆలస్యం కావడానికి సహేతుకమైన కారణాలు చూపాలంటూ కోరారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరింత స్పష్టత ఇచ్చారు. పోలవరం నిర్మిస్తున్న సంస్థకు నోటీసులు ఇచ్చామనీ, పనులను వేరేవారికి అప్పగించే ప్రక్రియ ప్రాసెస్ లో ఉందని ముఖ్యమంత్రి విలేకరులతో తెలిపారు. ఇలా మధ్యలో ప్రాజెక్టు పనుల్ని వేరేవారికి అప్పగించడం వల్ల ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులూ ఉండవన్నారు. అనుకున్న సమయంలో వారు ఓ పనిని పూర్తి చేయలేనప్పుడు, ప్రాజెక్టు నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని వేరే కంపెనీకి ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్ కూడా పిలుస్తామన్నారు.
పోలవరం విషయంలో ఇది ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగానే చెప్పుకోవాలి. మరో రెండు వారాల్లో కొత్త కంపెనీ పనుల్లోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా స్పిల్ వే కాంక్రీటు పనులు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఏదేమైనా, ట్రాన్స్ ట్రాయ్ లాంటి కంపెనీని తప్పించడం కీలక మార్పు అనాలి. అయతే, రాబోయే కంపెనీ ఎంత వేగంతో పనిచేస్తుందనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. ఇప్పటికి కూడా 2018 నాటికి చంద్రబాబు ఆశించిన స్థాయిలో పనులు జరుగుతాయనే నమ్మకం అధికార పార్టీ వర్గాల్లో పెద్దగా లేవు. ఎప్పటికప్పుడు చంద్రబాబు చెబుతూ ఉన్నా కూడా టీడీపీ నేతల్లోనే ఆ నమ్మకం లేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో పోలవరం కచ్చితంగా కీలకాంశంగా మారుతుంది. పోలవరం నీళ్లను రైతులకు అందించి తీరతామని మొదట్నుంచీ చెబుతున్న నేపథ్యంలో ఎంతో కొంత పనిని పూర్తి చేసి చూపాలన్నది ముఖ్యమంత్రి పట్టుదలగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్న పట్టుదల మంచిదే అనాలి.