పోలవరంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంలో వారికి అనుభవం రీత్యా అందులో ఆశ్చర్యమేమీ లేదు. అయితే వారు పాత రేట్లకే పనిచేయడానికి సిద్దమయ్యారని చెప్పడం ఇక్కడ విశేషం. అందుకు ఆయన చెప్పిన కారణం మాత్రం సహేతుకంగా లేదు. పేరు వస్తుంది గనక నష్టం వచ్చినా చేస్తామని అన్నారట. గతంలో రేట్లు పెంచాలని ప్రతిపాదించిన తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఇలా చెబుతున్నారనుకోవాలి. కనీస నష్టం అయితే ఎవరైనా భరించగలరు గాని ఇంత పెద్ద నిర్మాణాలలో మొత్తం నెత్తిన వేసుకోవడానికి ఎవరూ సిద్ధం కారు. నవయుగ సంస్థ పాత రేట్లకే చేయడాన్ని బట్టి చూస్తే మధ్యలో నడిచిన మతలబులు ప్రశ్నార్థకమవుతాయి. బిజెపితో సహా ప్రతిపక్షాలు చేసిన విమర్శలు నిజమేనని దీనివల్ల రుజువవుతుంది. ఈలోగా ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రిని కలిసి పాత విషయాలే విన్నవించడం కూడా ఆశ్చర్యంగా వుంది. ఎందుకంటే గత వారమే ప్రధానిని కలిసిన చంద్రబాబు వాటినే చెప్పడానికి ఇంత శ్రమ తీసుకోరు.ఇక్కడ కూడా పోలవరమే చర్చకు వచ్చినట్టు ఆయన మాటలే చెబుతున్నాయి. ఇంతా చేసి పునరావాస సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. కేంద్రం దానికి సంబంధించిన ఖర్చు భరించడానికి సిద్ధమైనట్టు ప్రకటించడం లేదు.