పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ సర్కారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలిసిందే. వచ్చే ఏడాది నాటికి గ్రావిటీ ద్వారా రైతులు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు. అయితే, గడచిన రెండున్నర నెలలుగా పోలవరం పనుల్లో కొంత వేగం తగ్గింది. ముఖ్యంగా, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని కొన్ని పనుల నుంచి తప్పించి, కొత్తవారికి కేటాయించాలని రాష్ట్ర సర్కారు భావించింది. దానిపై మొదట్లో కేంద్రం మోకాలడ్డటం, ఆ తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సందిగ్ధ వాతావరణం, ఎట్టకేలకు పోలవరం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవంటూ కేంద్రం భరోసా ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. టెండర్ల విషయమై ఇంతవరకూ ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయనే చెప్పాలి. అయితే, తాజాగా కాంట్రాక్టరు విషయంలో కేంద్రమంత్రి నితిన్ గట్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నవయుగ, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో గట్కరీ భేటీ అయ్యారు. వీరి మధ్య ఒక ఒప్పందాన్ని ఆయన స్వయంగా చొరవ తీసుకుని కుదిర్చారు. స్పిల్ వే, కాంక్రీట్ పనుల్ని నవయుగ కంపెనీకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కోరినట్టుగానే ట్రాన్స్ ట్రాయ్ నుంచి ఈ పనుల్ని వేరే కంపెనీకి ఇచ్చారు. ఇప్పుడీ పనుల్ని నవయుగ కంపెనీ చాలా వేగవంతం చేస్తుందనే భరోసా ఈ భేటీలో వ్యక్తమైంది. కేంద్రమంత్రి స్వయంగా కాంట్రాక్టర్లను పిలిపించుకుని, చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకోవడం.. పోలవరం విషయంలో కేంద్రం చూపిన చొరవగానే చూడొచ్చు. అయితే, ఇదే అంశమై ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు గట్కరీని కూడా కలిశారు. మూడు నెలలుగా పోలవరం పనులు నిలిచిపోయాయనీ, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి చేయకపోతే భాజపాతో పొత్తు విషయమై కూడా టీడీపీ పునరాలోచిస్తుందనే సంకేతాలు ఇచ్చారు.
నిజానికి, విభజన హామీల విషయంలో నరేంద్ర మోడీ సర్కారు ఏపీకి మొండి చేయి చూపిస్తోందనే అభిప్రాయం ఏపీ ప్రజల నుంచి వ్యక్తమౌతోంది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాలపై అయితే కేంద్రం తీరుపై చాలా అసంతృప్తి ఉంది. ప్యాకేజీ ఇచ్చారన్న పేరుకే తప్ప… కేటాయింపులపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందనే అభిప్రాయమూ కలిగింది. వీటన్నింటికీ పరిగణనలోకి తీసుకున్నాకనే పోలవరంపై కేంద్రం ఈ మాత్రం చొరవైనా చూపిందని అనుకోవచ్చు. మరి, ఇదే తరహాలో బడ్జెట్ లో ఏపీకి పెద్ద పీట వేస్తారా లేదా, రైల్వేజోన్ పై కీలక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. మిగతా అంశాలు ఎలా ఉన్నా.. పోలవరం ప్రాజెక్టు వరకూ ఇది మరో కీలక నిర్ణయమే అని చెప్పాలి. 2019 నాటికి గ్రావిటీ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వడం సాధ్యమే అని అనిపిస్తోంది.