రైతు రుణమాఫీ నేపథ్యంలో పోలీసులు రైతులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు. రైతుల అకౌంట్లో డబ్బులు జమ కానుండటంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని..రైతులంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.
ఆగస్ట్ 15లోపు రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సర్కార్…మొదటి విడతలో లక్షలోపు రుణాలను మాఫీ చేస్తోంది. గురువారం సాయంత్రమే 11లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు నేరుగా జమ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు వాట్సప్ లో APKఫైల్స్ పంపుతున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి వచ్చే APK ఫైల్స్ ను ఓపెన్ చేయగానే.. ఫోన్ సైబర్ నేరగాళ్ళ కంట్రోల్ లోకి వెళ్తుందని చెప్పారు. ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్లను హ్యాక్ చేసి కేటుగాళ్ళు డబ్బులను దోచేస్తారని.. ఇప్పటికే ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారని ..ఈ APKఫైల్స్ తో ఎలాంటి మెసేజ్ లు వచ్చినా రైతులెవరూ ఓపెన్ చేయకూడదని పోలీసులు సూచించారు.
ఎవరైనా సైబర్ నేరగాళ్ల మోసానికి చిక్కితే.. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.