ఏపీలో సారా మరణాలు చర్చనీయాంశమవుతున్నాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరుచుకుపడటంతో.. సారాలేదని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నా… పోలీసులు మాత్రం అక్రమ సారా వ్యాపారులపై విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల్లోనే సారా కేసుల్లో ఏకంగా 1129 కేసులు నమోదు, 677 మంది అరెస్టు చేసినట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ప్రకటించారు. చివరికి సీఎం జగన్ జంగారెడ్డి గూడంలో సారా కాయడం అసాధ్యమని చెప్పారు. కానీ అక్కడ కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
జంగారెడ్డి గూడెంలో సారా మరణాలు నమోదైన తర్వతా 10వ తేదీ నుండి 14 వతేదీ వరకు నాటు సారా స్థావరాల పైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల అధ్వర్యంలో దాడులు చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే 1129 కేసులు నమోదు, 677 మంది అరెస్టు చేశారు. అంతే కాదు సారా తయారీకి ఉపయోగించే 5,76,710 లీటర్ల పులియ బెట్టిన బెల్లపు ఊట ద్వంసం చేశారు. 13,471 లీటర్ల సారా స్వాధీనం తోపాటు 47 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎస్ఈబీ అధికారులు అధికారికంగా వెల్లడించిన వివరాలు.
నాలుగు రోజుల దాడుల్లోనే ఇంత భారీగా బయటపడ్డాయంటే.. ఏపీలో సారా సునామీ ఉందని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు సారా మరణాలు చోటు చేసుకున్నాయని హడావుడి చేస్తున్నారు కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. మద్యం రేట్లు విపరీతంగా పెంచడం… అంతకు మించి వైసీపీ నేతలు.. సారా వ్యాపారాన్ని పూర్తిగా గుప్పిట్లోకి పెట్టుకోవడంతో.. ఎవరూ కన్నెత్తి చూడలేని పరిస్థితి ఏర్పడింది. అది ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది.