పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చాలా రోజుల నుండి హీరోలు ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ పడుతున్నారు. సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లను ఎవరో దుండగులు చింపివేశారు. అది ప్రభాస్ అభిమానులే చేసారనే అనుమానంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వారి ఇళ్ళపై, కార్యాలయాలపై దాడులు చేసి విద్వంసం సృష్టించారు. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో పోలీసులు సెక్షన్:144 విధించి కర్ఫ్యూ అమలు చేయాల్సి వచ్చింది. ఈ దాడుల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అభిమానులపై భాదితులు పిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. తమ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితి మళ్ళీ అదుపు తప్పునట్లయితే పోలీసులు వారిపై లాఠీలు ఝళిపించక తప్పదు. అప్పుడు సమస్య ఇంకా తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది.
హీరోలను అభిమానించడం వారి పుట్టినరోజునాడు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడితే అందరూ హర్షిస్తారు. కానీ అభిమాన సంఘాల పేరుతో కుల పోరాటాలు చేయడాన్ని ప్రజలే కాదు చివరికి ఆ హీరోలు కూడా హర్షించరని గమనించాలి. వారు నిజంగా అభిమానులే అయితే తమ హీరోలకి అప్రదిష్ట కలిగించే ఇటువంటి పనులను చేయకూడదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా తనకు కులమతాలు, ప్రాంతీయ బాషాబేధాలు అంటే అస్సలు నచ్చవని చెపుతుంటారు. అయినా ఆయన అభిమానులు ఆమాతలని చెవి కెక్కించుకోకుండా ఈ విధంగా దాడులు చేయడం శోచనీయం. ప్రభాస్ కూడా ఎప్పుడూ తన సినిమాల గురించే మాట్లాడుతారు తప్ప ఏనాడూ తన కులం ప్రస్తావన చేయరు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎన్నడూ కలిసి సినిమా చేయనప్పటికీ వారిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. కానీ వారి అభిమాన సంఘాలు మాత్రం ఈవిధంగా పరస్పర దాడులు చేసుకోవడం వలన ఆ హీరోలిద్దరికీ చెడ్డ పేరు వస్తోంది.