విశాఖలో కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలను రిస్క్‌లో పెట్టిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యంపై ఇంత వరకూ ఈగ కూడా వాలలేదు. కానీ బాధితులపై మాత్రం వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ నిర్వాకానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా.. నిరసన చేసినా.. పోలీసులు ఉన్న పళంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ వద్ద మృతదేహాలతో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిశ్రమను పరిశీలించడానికి డీజీపీ, మంత్రి అవంతి తదితరులు అదే సమయంలో వచ్చింది. దాంతో పోలీసులు అక్కడ ఆందోలన చేస్తున్న వారందర్నీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. యువకులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు.
అప్పటికి చుట్టుపక్కల గ్రామాల నుంచి నిరసన తెలిపేందుకు వస్తున్న గ్రామస్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. పలువురు వెంకటాపురం గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్లారు. అయినా వందల మంది పరిశ్రమ వద్దకు తరలి వచ్చారు. పరిశ్రమను తక్షణం మూసివేయాలని.. అక్కడ్నుంచి వేరే చోటకు తరలించే వరకూ ఆందోళన చేస్తామని.. సమీప గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఎవరు గట్టిగా మాట్లాడినా పోలీసులు అరెస్టు చేస్తున్నారని.. బాధిత గ్రామాల్లో గాలిలో ఆక్సిజన్ స్థాయిని పెంచే ప్రయత్నాలు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్జీ పాలిమర్స్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులంతా దిలాసా ప్రభుత్వ పెద్దలతో కలిసి సమీక్షల్లో పాల్గొంటున్నారు. అదో మంచి కంపెనీ అని స్వయంగా ముఖ్యమంత్రి కితాబివ్వడంతో.. తదుపరి చర్యలు తీసుకునే విషయంలో అధికారులు వెనుకడుగు వేస్తున్ననట్లుగా తెలుస్తోంది. న్యాయం చేయాలని ఆందోలన చేస్తున్న బాధితుల విషయంలో మాత్రం.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.