వైసీపీ హయాంలో నడిరోడ్డుపై బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేసి మరీ దర్జాగా తిరిగిన తురక కిషోర్ అనే రౌడీషీటర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన కనిపించకుండా పోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడితో పాటు ఆయన కూడా పరారయ్యారు. అప్పటి నుంచి పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. పట్టించుకోవడం లేదు కదా అని అనుకున్నారేమో కానీ హైదరాబాద్ లో మళ్లీ బ హిరంగంగా తిరగడం ప్రారంభించారు. దాంతో పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
మాచర్లలో పిన్నెల్లి అటవిక రాజ్యానికి ఈ తురక కిషోర్ సైన్యాధ్యక్షుడిగా ఉండేవారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ వాళ్ల నామినేషన్లను తిరస్కరిస్తూండటం… చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేస్తూండటంతో పార్టీ తరపున బుద్దా వెంకన్న, బొండా ఉమ వెళ్లారు. వీళ్లిద్దరిపై పట్టణ నడిబొడ్డున చేసిన దాడి దృశ్యాలు సంచలనంగా మారాయి. అంతటి దాడి చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకుని తర్వాత కొంత కాలం మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు.
పన్నెల్లి బ్రదర్స్ రైట్ హ్యాండ్ గా ఉండి.. వారు చేయమన్న ఘోరాలన్నీ చేసేవారు. వైసీపీ హయాంలో ఇలాంటి వారిదే రాజ్యం. ఎన్ని ఘోరాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదు సరి కదా.. పోలీస్ స్టేషన్లోనే బర్త్ డే వేడుకులు చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పటికి పట్టుకున్న పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాల్సి ఉంది.