వైకాపా రాజంపేట ఎంపి మిథున్ రెడ్డిని నిన్న రాత్రి పోలీసులు చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. గత ఏడాది నవంబర్ 26వ తేదీన ఆయన తిరుపతి విమానాశ్రయ మేనేజరుపై దాడి చేసినందుకు అరెస్ట్ చేయబడ్డారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చిత్తూరు జిల్లాకి చెందిన ఆరుగురు వైకాపా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసారు. మిథున్ రెడ్డిని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ఆయనను శ్రీకాళహస్తిలో మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకి నిరసనగా చిత్తూరు, కడప జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలు బారీ సంఖ్యలో శ్రీకాళహస్తి చేరుకొనేందుకు బయలుదేరగా వారిని పోలీసులు దారిలో అడ్డుకొని అరెస్ట్ చేసారు. ఎటువంటి అవాంచనీయమయిన ఘటనలు జరుగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తగా చిత్తూరు జిల్లాలో సెక్షన్ 144 విధించారు. మిథున్ రెడ్డిని, వైకాపా ఎమ్మెల్యేలని, కార్యకర్తలని అరెస్ట్ చేయడంపై వైకాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.