పవన్ కల్యాణ్ విశాఖలో ఉంటే శాంతిభద్రతలకు విఘాతమని విశాఖ పోలీసులు చెబుతున్నారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని.. తక్షణం విశాఖనుంచి వెళ్లిపోవాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను పవన్ కల్యాణ్ తీసుకున్నారు. అయితే విశాఖ నుంచి వెళ్లే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వందల మంది జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేశారని వారిని విడిచి పెట్టే వరకూ విశాఖ నుంచి కదిలే ప్రశ్నే లేదని చెప్పారు. ఇప్పటికే జనవాణి కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించనీయలేదు. అడ్డుకున్నారు.
డ్రోన్లు పెట్టి పలు చోట్ల మైనింగ్ దోపిడిని చూపిస్తామన్న కారణంగా డ్రోన్లను నిషేధించారని.. మేం వచ్చి రెచ్చగొట్టడం వల్లే ఘటన జరిగినట్లుగా నోటీసులిచ్చారని పవన్ మండిపడ్డారు. ఎన్ని కేసులు. పెట్టినా.. జైలుకు వెళ్లేందుకైనా సిద్దమన్నారు. నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చే వరకు మేం పోరాడతామని ప్రకటించారు. ప్రతీ దానికి కేంద్రం వద్దకు ఎలా వెళ్తామని.. 30 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేకహోదా అడగరు. ప్రజలెవరికీ కోపాలు రానప్పుడు మనమేం చేస్తామని పవన్ నిర్వేదం వ్యక్తం చేశారు.
రెండు చోట్లా ఓడిపోయా అని అంటున్నారు.. అలాంటప్పుడు నాకెందుకు భయపడుతున్నారని పవన్ వైసీపీని ప్రశ్నించారు. ప్రజలను ఆలోచింపజేస్తారనో.. ప్రజలు మారిపోతారనో భయం వాళ్లకుందని.. మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయకార్యక్రమాలను ఆపడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలీసులను ఉపయోగించడంపై అన్ని పార్టీల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విమానాశ్రయం దగ్గర ఘటన తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే.. వైసీపీ నేతలే ప్లాన్డ్ గా అలా చేసి.. తర్వాత పోలీసుల్ని దింపి.. పవన్ ను కదలనీయకుండా చేశారన్న వాదన వినిపిస్తోంది.