గుంటూరులో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఐదు వందల మంది పోలీసుల్ని బుధవారం రెడీ చేశారు. అర్థరాత్రి ఏ టీడీపీ నేతనో ఎత్తేయబోవడమో..లేకపోతే టీడీపీ ఆఫీసుపై దాడిచేయడం… సంగం డెయిరీని క్లోజ్ చేయించడం లాంటి గొప్పపనేదే చేయబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఆ పోలీసులు అందర్నీ పోలోమంటూ నాగార్జున సాగర్ వైపు మళ్లించారు. దీంతో ఓహో ఎలక్షన్ స్టంటా అని అని ఆశ్చర్యపోయారు.
ఓ వైపు పంటలు ఎండిపోతూంటే పట్టించుకోలేదు కానీ.. తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న సమయంలో సాగర్ గేట్లు ఎత్తుతామన్నట్లుగా హడావుడి చేశారు. పోలీసుల్ని మోహరించారు. అటు వైపు సహజంగానే తెలంగాణ పోలీసులు కూడా వచ్చారు. ఏదో డ్రామా క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారని అర్థమయింది. ఇప్పటికీ పోలీసులు సాగర్ దగ్గరే మోహరించి ఉన్నారు. గత నాలుగున్నరేళ్లలో… సాగర్ నుంచి తెలంగాణ సర్కార్ నీరు ఎలా వాడుకున్నా… జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ లేకపోయినా హడావుడి చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ పండించడానికి బీఆర్ఎస్ పార్టీకి.. ఇలా జగన్ రెడ్డి సర్కార్ పోలీసుల ద్వారా సాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అంత మంది పోలీసుల్ని పంపాల్సిన అవసరం ఏమిటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. సెంటిమెంట్ రాజేసి ఏదో చేద్దామనుకుంటున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్, జగన్ మధ్య ఉన్న స్నేహంతో చివరి క్షణంలో ఈ సాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చి నల్లగొండ, ఖమ్మం రాజకీయాలను మార్చేద్దామని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమయిందన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.