ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ కుప్పుకూలిపోయింది. రాజకీయ కారణాలతో తప్పుడుకేసులు పెట్టడం.. నియోజకవర్గ స్థాయి నేతల్ని అర్థరాత్రుళ్లు అరెస్టు చేయడం పరిపాటిగా మారింది. పులివెందులలో సీఎం జగన్కు ప్రత్యర్థిగా ఉన్న బీటెక్ రవిని అరెస్టు చేసిన విధానం… ఆయనపై పెట్టిన కేసును చూస్తే.. మన రాష్ట్రంలో పోలీసింగ్ అనేది ఒకటి ఉందా .. లేక ప్రైవేటు సైన్యం ఏమైనా పరిపాలిస్తుందా అన్న అనుమానం రాకమానదు.
పదినెలల కింద తోపులాట జరిగితే కిడ్నాప్ తరహాలో బీటెక్ రవి అరెస్టు
పులివెందున టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసులు రాత్రి పూట ఫోన్లు ట్యాప్ చేసి.. నిఘా పెట్టి ప్రయాణంలో ఉన్న ఆయనను నిర్మానుష్య ప్రాంతంలో అరెస్టు చేశారు. ఏ కేసులో అరెస్టు చేశారో.. ఎందుకు చేశారో.. అసలు పోలీసులు చేశారో లేదో ఎవరికీ తెలియదు. మీడియాలో కిడ్నాప్ అనే ప్రచారం జరిగిన తర్వాత ఓ పోలీస్ స్టేషన్ నుంచి మేమే అరెస్టు చేశామన్న సమాచారం ఇచ్చారు. ఆ కేసు ఏమిటంటే పది నెలల కిందట లోకేష్ కడపకు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన తోపులాట కేసు. పది నెలలు అయింది.
పదినెలల ఆలస్యమైన కేసులోనూ రిమాండ్
ఇప్పుడే ఆ తోపులాటలో ఏఎస్ఐకు గాయాలయ్యాయని గుర్తొచ్చింది. ఆ ఏఎస్ఐ ఫిర్యాదుతోనే వెంటనే నాన్ బెయిలబుల్ కేసుగా మార్చేసి అరెస్టు చేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు కేసు విషయం విచారణకు వచ్చినప్పుడు నాలుగు రోజులు ఆలస్యంగా కేసు పెడితేనే సుప్రీం తీవ్రంగా స్పందించింది. ముందస్తు బెయిల్ ను సమర్థించింది. ఇక్కడ పది నెలలు ఆలస్యమైనా .. దిగువకోర్టు రిమాండ్ కు పంపింది. అసలు ముందుగా దిగువకోర్టు జడ్జి బుధవారం కోర్టు ముందు హాజరు పరచాలన్నారు. కానీ తర్వాత రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పదినెలలు బీటెక్ రవి అందుబాటులో లేరట
పది నెలలు ఎందుకు ఆలస్యమయిందంటే… బీటెక్ రవి అందుబాటులో లేరని పోలీసులు చెబుతున్నారు. ఆయన ఎప్పుడూ పులివెందులలోనే ఉంటారు. ఇటీవల పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అందుబాటచులో లేరని చెప్పడానికి ఒక్కనోటీసు అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. ఈ విషయంలో పోలీసులు ప్రతీ చట్టాన్ని… బీటెక్ రవి ప్రతి హక్కునూ ఉల్లంగించారు. ఒక్క రోజు ముందే కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఎవరో ఎవరిపైనో దాడి చేస్తే వాళ్లు ప్రవీణ్ రెడ్డి అనుచరులు అని ఆయనపై కేసు పెట్టేశారు.
అచ్చమైన అరాచకపాలనకు స్పష్టమైన చిరునామా
పోలీసు వ్యవస్థ ప్రైవేటు సైన్యంగా మారింది.. కేసుల పేరుతో కిడ్నాప్లకు పాల్పడి.. పాలకుల రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష ఇంచార్జుల్ని.. అరెస్టు చేసి.. వారు ప్రజల్లోకి వెళ్లకుండా చేసి.. గెలిచేయాలని .. ఓట్ల జాబితాల్లో అక్రమాలను ప్రశ్నించకూడదని అనుకుంటోంది. దీనికి పోలీసు వ్యవస్థ ఓ ప్రైవేటు సైన్యంలా మారింది. అరాచక పాలనకు అచ్చమైన చిరునామాగా ఏపీ మారింది.