రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి పవన్ చేస్తున్న పర్యటన లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా తాళ్లతో పోలీసులు అడ్డుకోవడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే…
రాజధానిని మార్చడానికి జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటి నుండి అమరావతిలో రైతులు రోడ్లు ఎక్కి దీక్షలు చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులతో, మహిళతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి చేపట్టారు. తనకు ఓట్లు ముఖ్యం కాదని మార్పు ముఖ్యము అని , అందుకే ఓట్ల కోసం చూడకుండా రైతులకు అండగా నిలబడేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు చంద్రబాబు ని నమ్మో, లేదంటే ఒక వ్యక్తి ని నమ్మో అన్ని వేల ఎకరాలు ఇవ్వలేదని, వారు ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారని, అలాంటిది ప్రభుత్వమే వారిని మోసం చేయడం బాధాకరమని అన్నారు. ఒకవేళ అమరావతిలో అవకతవకలు జరిగితే జగన్ రెడ్డి అలాంటి అవకతవకలు చేసే వారిని శిక్షించాలి అని, అంతేతప్ప భూములు ఇచ్చిన రైతులను శిక్షించ కూడదు అని వ్యాఖ్యానించారు.
అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , కృష్ణాయ పాలెం నుండి మందడం మీదుగా మంగళగిరి వెళ్లే సమయంలో రెండు వందల మంది పోలీసులు పవన్ కాన్వాయ్ ని తాళ్ల సహాయంతో అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకు మందడం వెళ్ళడానికి అనుమతి లేదని పోలీసులు పవన్ ని అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కారు దిగి కాలినడకన మందడం బయలుదేరారు. అభిమానులు జనసేన కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.
దీంతో ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది.