ప్రజాస్వామ్య రక్షిత రక్షితః అన్నారు పెద్దలు.. అంటే ప్రజాస్వామ్యాన్ని నువ్ కాపాడు.. నిన్ను ప్రజాస్వామ్యం కాపాడుతుంది. నువ్వే ప్రజాస్వామ్యాన్ని చంపేస్తే ఆ తర్వాత నిన్ను కాపాడటానికి ఆ ప్రజాస్వామ్యం బతికి రాదు. ఎందుకంటే… నువ్ ప్రజాస్వామ్యాన్ని ఎంత పాతాళానికి తొక్కి అధికారాన్ని అడ్డగోలుగా అనుభవించావో.. తర్వాత వచ్చే వాళ్లు అంత కంటే ఎక్కువగా తొక్కి.. తాము పడిన కష్టాలకు.. నష్టాలకు.. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. దాని వల్ల ప్రజాస్వామ్యం ఎప్పటికప్పుడు హత్యకు గురవుతుంది.. చివరికి అరాచకానికి దారి తీస్తుంది. కారణం ఏదైనా దానిని ప్రారంభించిన వారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు, ఈగో శాటిస్ఫేక్షన్ పొందవచ్చు కానీ.. తర్వాత తొలి ఫలితం కూడా తానే అనుభవిస్తాడు. ఈ రోజు ఉన్న పరిస్థితులు ఎల్లప్పుడూ ఉంటాయనుకుంటే అంత కంటే పిచ్చితనం మరొకటి ఉండదు. బటన్ నొక్కడమే ఏకైక విధి అనుకుంటున్న ప్రభుత్వంలో జరుగుతోంది అదే.
అప్రజాస్వామ్య నియంతలందరి క్లైమాక్స్ ఒక్కటే !
ఒకప్పుడు పాకిస్థాన్‌లో ముషారప్ అనే నియంత ఉండేవాడు. ఆయన కూడా ఎన్నికల్ని జరిపేవాడు. ఆ ఎన్నికలను ఇలాగే ప్రజల్ని భయపెట్టి మిలటరీతో భయపెట్టి గెలవాలనుకునేవాడు. చివరికి ఆయన ఎటు పోయాడో కూడా ఎవరికీ తెలియదు. సొంత దేశంలో ఆయనకు ఉరిశిక్ష వేయడంతో విదేశాలకు పరారయ్యాడు. చనిపోయాడని కొందరు… లేదని మరికొందరు చెబుతూ ఉంటారు. కానీ ముషారఫ్ అధికార పీఠంపై ఉన్నప్పుడు తన సీటు ఎల్లప్పుడూ తనకే అతుక్కుని ఉంటుందని భావించేవాడు. కానీ చివరికి దిక్కులేని మరణం చూడాల్సి వచ్చింది. ఇది నియంతలకు పట్టే అంతిమ గతి. ఎవర్ని చూసుకున్నా అదే పరిస్థితి అయితే మన దేశంలోనూ ఉంటుంది. కాకపోతే మనది ప్రజాస్వామ్యం. స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత నయా ప్రజాస్వామ్య పాలకులు ప్రజాస్వామ్యానికి సరికొత్త సవాళ్లు విసురుతున్నారు. ప్రజాస్వామ్య నియంతలుగా భావించుకుంటున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. అటువంటి వారి ముగింపు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ.. దేశానికి .. ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ?\
బ్రిటిష్ రాజ్ తరహాలో బటన్ రాజ్ !
బ్రిటిష్ పరిపాలనలో కోర్టుల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మైలార్డ్ అంటారు. ఇది బానిసత్వానికి సూచిక అని ఈ పదం వాడొద్దని కోర్టులు చెబుతూ ఉంటారు. బ్రిటిష్ ఆనవాళ్లు మనకు కనిపించకుండా చేసుకున్నాం. కానీ అప్పట్లో స్వాతంత్ర్య పోరాటాన్ని అణిచి వేయడానికి బ్రిటిష్ పాలకులు తెచ్చిన చీకటి చట్టాలను.. ఇప్పుడు అదే బ్రిటిష్ మైండ్ సెట్ ను అలవర్చుకున్న ప్రజాస్వామ్య నియంతలు తెరపైకి తె్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కట్టడి చేయాలని.. సంకెళ్లతో బందీ చేుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాని ఫలితమే కుప్పంలోని ఘటన. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఎమ్మెల్యే. గత 35 ఏళ్లుగా కుప్పం ప్రజల జీవితాల్లో చంద్రబాబు ఓ భాగం. అలాంటి చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా.. బ్రిటిష్ కాలం నాటి చట్టం పేరుతో విడుదల చేసిన జీవోతో అడ్డుకున్నారు. నిజానికి ఆ చట్టం చట్టబద్ధతపై అనేక సందేహాలున్నాయి. కానీ పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. పధ్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుతో దురుసుగా ప్రవర్తించారు. స్వాగతం చెప్పడానికి వచ్చిన కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. కనీసం రెండు వేల మంది పోలీసుల్ని మోహిరంచారు. నిజానికి ఐదువందల మంది పోలీసుల్ని భద్రత కోసం కేటాయిస్తే చంద్రబాబు పర్యటన సాఫీగా సాగిపోయేది. అది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ అడ్డుకోవడానికి రెండు వేల మంది పోలీసుల్ని పెట్టారు కానీ.. భద్రత ఇవ్వడానికి ఐదు వందల మందిని పెట్టలేకపోయారు. ఫలితంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సొంత నియోజకవర్గంలో చంద్రబాబును అడ్డుకున్నామన్న ఓ ఆనందం పాలకుల్లో కనిపించి ఉంటుంది కానీ.. ఇది ప్రజాస్వామ్యమా ? ప్రజాస్వామ్య నియంత చేస్తున్న పరిహాసమా ?
చట్టాలన్నీ విపక్షాలు, ప్రజలకే.. వైసీపీ నేతలు చట్టాలకతీతమైన వ్యక్తులు !
కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగిన కారణంగానే ఈ జీవో వచ్చిందని ప్రపంచం మొత్తానికి తెలుసు… ఇది వైసీపీకి కూడా వర్తిస్తుంది..ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు అని సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై సమర్థించుకున్నారు. ఆయన ఇలా సమర్థించుకుంటున్న సమయంలో రాజమండ్రిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. సిటీ మధ్యలో ఉన్న కళాశాల గ్రౌండ్లో వృద్ధులను బలవంతంగా తరలించి సభ పెట్టారు. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్ షో నిర్వహించారు. అవన్నీ ఆయనకు ఎలా కనిపించాయో తెలియదు. నిజానికి ఏపీ ప్రజల ఆలోచనా శక్తిని ఈ సకల శాఖ మంత్రితో పాటు వైసీపీ నేతలంతా చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. సీఎం జగన్ కూడా. ఎందుకంటే.. ఏపీలో అమలవుతున్న చట్టాలు కేవలం ప్రతిపక్షలకు మాత్రమేనని కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. నడిరోడ్డుపై హత్యాయత్నం చేసినా వైసీపీ నేతలకు స్టేషన్ బెయిల్స్ వస్తాయి. నిన్నటికి నిన్న నెల్లూరు జిల్లా కావలిలో పెట్రోల్ బంక్‌లో అప్పు కింద పెట్రోల్ పోయలేదని .. అక్కడ పని చేస్తున్న దళిత యువకుడ్ని వైసీపీ ఎంపీటీసీ చితకబాదారు. వైసీపీ అనే ట్యాగ్ ఉంది కాబట్టి.. స్పష్టమైన సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నా.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. అదే సమయంలో మాచర్ల ఘటనలో సంఘటనా స్థలంలో లేని వారిపై హత్యయత్నం కేసులు పెట్టారు. ఇక టీడీపీ ఆఫీసుపై మూకుమ్మడి దాడి దగ్గర్నుంచి హత్యలు, ఘోరాలు… నేరాలు.. రేప్‌లలో.. వైసీపీ నేతల పేరు బయటపడితే చాలు వారికి చట్టం వర్తించదన్నట్లుగా వ్యవహిరంచిన దాఖలు కోకొల్లలు. తన మాజీ డ్రైవర్ ను చంపేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబుు పోలీసులు ఇస్తున్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిందితుడి గురించి చెప్పేటప్పుడు పోలీసు అధికారి.. ఎమ్మెల్సీ గారు అంటూ వినయం ఒలకబోశారు. అదీ చట్టం అమలవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి కూడా ఆ జీవో వర్తిస్తుందని ఎనరైనా అనుకుంటారా ?.
ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత మర్చిపోయిన ప్రభుత్వం !
ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై పోరాడటం ప్రతిపక్షాల విధి. ఇది ప్రజాస్వామ్య హక్కు., తమ వైఫల్యాలపై పోరాడితే తమ అనుమతి తీసుకోవాలని రాజ్యాంగం ప్రభుత్వానికి అధికారమివ్వలేదు. ప్రజా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగం నిర్దేశించింది. ఇప్పటి వరకూ ఉన్న ప్రభుత్వాలు అదే చేశాయి. చంద్రబాబు పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్నారు. వైఎస్ఆర్ ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వీరు సీఎంగా ఉన్న సమయంలో ప్రజా ఉద్యమాలు జరగలేదా ? అప్పుడు ప్రభుత్వాలు భద్రత కల్పించలేదా ? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు. జగన్ పాదయాత్ర చేశారు. వారికి ప్రభుత్వం తరపున స్పష్టమైన సహకారం లభించింది. నిజంగా పోలీసులే్ వదిలేసి ఉంటే వారి పాదయాత్ర తొక్కిసలాటలతో జరిగేది. తెలంగాణ ఉద్యమం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి చట్టాలను తీసుకు రాలేదే ?. అలాగే అణిచి వేసి ఉంటే తెలంగాణ ప్రజల ఉద్యమం నిర్వీర్యమైపోయి ఉండేదే కదా?. ప్రజల హక్కులను ఎవరూ కాలరాయలేరని.. న్యాయస్థానాలు పదే్ పదె చెబుతున్నాయి. కానీ గత మూడున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రజల ప్రాథమికహక్కులను హరిస్తోంది. దాని కోసం వింత చట్టాలుపైకి తెచ్చి.. అసలు పొసగని అన్వయాలు చేసుకుని అమలు చేసుకుంటోంది. ప్రజాస్వామ్య నియంత పాలనను తీసుకొచ్చేసి నీతులు చెబుతున్నారు.
ఇంతటితో అయిపోతే.. వచ్చే వాళ్లు అంత కంటే ఎక్కువ చేస్తారు ? ఎవరికి నష్టం ?
నిజానికి అసలు సమస్య ఈ ప్రజాస్వామ్య నియంత పాలనలోనే లేదు. ఇది ప్రజాస్వామ్య పతనానికి దారి తీస్తుంది. అసలు ఆందోళన అదే. ఇవాళ ఇంత దారుణంగా అధికారాన్ని అడ్డగోలుగా వాడేసి.. ప్రతిపక్షాల్ని.. ప్రజల్ని నియంత్రించేసిన వైనం చూపించాక.. తర్వాత వచ్చే వాళ్లు చేతులు కట్టుకుని కూర్చుకుంటారా ? తమకు ఇంత బాధ పెట్టిన వాళ్లను ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ఇప్పటికే చాలెంజ్ చేస్తూంటారు. నిజానికి తప్పు చేసిన వాడ్ని శిక్షిస్తే..వాడిలో అంత కసి ఉండదు కానీ తప్పు చేయని వాడ్ని.. ప్రజాస్వామ్య హక్కుల్ని అనుభవించాల్సిన వాళ్లను శిక్షిస్తే అది ఎప్పటికైనా లావాలా పొంగుతుంది. రేపు ప్రభుత్వం మారదని గ్యారంటీ లేదు. ప్రభుత్వం మారితే ఏమవుతుంది. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐయామ్ యువర్ డాడ్ అని నిరూపిస్తారు. కానీ ఇప్పుడు.. ఈ ప్రజాస్వామ్య నియంత పనులకు వస్తున్నంత వ్యతిరేకత అప్పుడు రాదు. ఎందుకంటే.. ఆయన చేసిన వన్నీ కళ్ల ముందే ఉంటాయి. అధికారం ఉందని నువ్వని చేశావు.. ఇప్పుడు అనుభవించు అనే వారే ఎక్కువ ఉంటారు. ప్రభుత్వం మారితే జరగబోయేది కూడా అదే. అప్పుడు ఎవరు నష్టపోతారు ?. వైఎస్ఆర్సీపీ నష్టపోతుంది. ఆ పార్టీ నేతలు నష్టపోతారు. ఆ నష్టం కేసులు.. ప్రాణాలు.. ఆస్తుల రూపంలో ఉండవచ్చు. కానీ అసలు నష్టం ఇది కాదు. అసలు నష్టం .. దేశ ప్రజాస్వామ్యానికి జరుగుతుంది. పటిష్టమన దేశ ప్రజాస్వామ్య పునాదలకు పగుళ్లు ఏర్పడతాయి. అసలు దేశానికి జరిగే నష్టం ఇది.
తాత్కలిక రాజకీయ ప్రయోజనాలు లభించవచ్చు…. అంతిమంగా ప్రజాస్వామ్యానికే నష్టం !
ఓ పాలకుడు.. తమకు అధికారం వచ్చిందని వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తే.. మరో పాలకుడు.. అంతకు మించి చేస్తాడు. ఈ సైకిల్ అలా కొనాగుతూనే ఉంటుంది. ఒక వేళ ఎవరైనా అడ్డగోలుగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకపోతే.. సమాజం అతడ్ని చేతకాని వ్యక్తిగా ముద్ర వేస్తుంది. చంద్రబాబు ఇప్పుడు అదే ముద్రను ఎదుర్కొంటున్నారు. పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్న ఆయన ఈ తరహా ప్రజాస్వామ్య నియంతగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు ప్రతిపక్షాల ుఅనేవి ఉండేవా ? అనేది ప్రధానమైన ప్రశ్న. ఆయన ఒక్కరే కాదు ఇప్పటి వరకూ అందరూ అదే ప్రజాస్వామ్య విధానాలను అవలంభించారు కాబట్టే దేశ ప్రజాస్వామ్యంపై ఇంకా ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా విపరీత ఆలోచనలతో పుట్టుకు వస్తున్న పిల్ల ప్రజాస్వామ్య నియంతులు… దేశానికి చేటు చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ అంతే… కాకపోతే ఏపీలో విపరీతం !
నిజానికి ఇలాంటి విపీలోనే కాదు…దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ అదే పరిస్థి ఉంది. అక్కడ కూడా చాలా రోజుల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు, మానవహారాలు.. ఇట్ల తీరు తీరు నిరసనలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జనం, ప్రతిపక్షాలు గొంతెత్తే స్వేచ్ఛ లేకుండాపోయింది. ఎవరు ఏ సమస్యపైనైనా ఆందోళన చేయాలన్నా.. నిరసన తెలుపాలన్నా.. పోలీసులు ‘నో’ అంటున్నారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలతో అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీ లీడర్లు చేసే ధర్నాలు, ఆందోళనలకు మాత్రం దగ్గరుండి భారీ బందోబస్తు, భద్రత కల్పిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంపై ప్రభుత్వం అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో హక్కుల కోసం పోరాడడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రభుత్వం అణచేస్తున్నదని కోర్టులకు వెళ్లి పర్మిషన్లు తెచ్చుకునిచేసుకోవాల్సి వస్తోంది. అదే అధికార పార్టీకి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ ఆపేసి మరీ అధికార పార్టీ నేతల ధర్నాలకు కాపలా కాస్తున్నారు. ధర్నా చౌక్ వద్దని ఎత్తేసిన సీఎం కేసీఆర్.. అదే ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. కానీ ఇప్పటికీ విపక్షాలపై మాత్రం నియంత్రమే ఉంది.కానీ ఏపీతో పోలిస్తే కాస్త బెటర్ అనుకోవచ్చు. కానీ ఈ పోలిక పెద్ద గీత ముందు చిన్న గీత గీసినట్లే. రెండూ ప్రజాస్వామ్య వ్యతిరేకమే.
అయితే మన ప్రజాస్వామ్యం ఎప్పటికప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. బలపడుతూనే ఉంది. ఇలాంటి పిల్ల ప్రజాస్వామ్య నియంతలు విసురుతున్న సవాళ్లను కూడా అంతే గట్టిగా ఎదుర్కొంటుందని నమ్ముదాం.. లేకపోతే జరిగేది అరాచకమే మరి !