వైఎస్ వివేకా కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే కాదు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరిపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్లోనే ఓ వ్యక్తిపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. తొండూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదయింది. పోలీస్ స్టేషన్లోనే దాడి జరిగిందని చెప్పారు కాబట్టి పోలీసులే దీనికి సాక్షులన్నమాట.
దస్తగిరికి మస్తాన్ అనే సోదరుడు ఉన్నారు. ఆయనకు పెద్ద గోపాల్ అనే వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో గోపాల్ తొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు మస్తాన్‌ను పిలిపించారు. అయితే మస్తాన్ తర్వాత తన సోదరుడ్ని కూడా తనను ఇలా పోలీసులు తీసుకెళ్లారని చెప్పడంతో ఆయన కూడా స్టేషన్‌కు వెళ్లారు. అయితే స్టేషన్లో మాట మాట పెరిగి తనపై దస్తగిరి దాడి చేశాడని గోపాల్ అక్కడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఉండగానే దాడి చేశారని.. గోపాల్ ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు పెట్టారన్నమాట.
ఇప్పటికే వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు ప్రాణభయం ఉందని.. అదే పనిగా మొరపెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారుల్నే బెదిరిస్తున్నారని.. ఇక అప్రూవర్‌గా మారిన వారిని బెదిరించడం ఎంత పని అన్న చర్చ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి పోలీసుల తీరు వివాదాస్పదం అవుతోంది.