వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఈనెల 26నుండి గుంటూరులో చేయబోయే ఆమరణ నిరాహార దీక్షకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే జగన్ నిరాహార దీక్ష చేయాలనుకొంటున్నారని, రాష్ట్ర ప్రయోజనం కోసం పోరాడుతున్న ఆయన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం చాలా విచారకరమని అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా జగన్ అదే చోట దీక్ష చేపడతారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని అందుకే వైకాపా దాని కోసం పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి అడ్డుపడుతోందని అన్నారు. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయాలని ఆయన డిమాండ్ చేసారు.
జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలియగానే గుంటూరులో ఏర్పాటు చేస్తున్న దీక్ష వేదిక దగ్గరకి వైకాపా నేతలు, కార్యకర్తలు చేరుకొంటుండంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. జగన్ దీక్షకు పోలీసుల అనుమతి కోరుతున్న వైకాపా, ఒకవేళ అనుమతి ఈయకపోయినా జగన్ దీక్ష చేస్తారని ప్రకటిస్తున్నప్పుడు ఇక పోలీసుల అనుమతి గురించి మాట్లాడటం కూడా అనవసరమే. జగన్ అక్కడే దీక్ష చేసేందుకు సిద్దపడితే పోలీసులు ఆయనని ముందే నిర్బంధించవచ్చును. కనుక పంతానికి పోయి సమయం వృధా చేసుకొనే కంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించి వైకాపా ఆలోచిస్తే మంచిదేమో?