వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీ నేతలకి కూడా తెదేపా ప్రభుత్వం ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26 నుండి గుంటూరు ఏసి కాలేజీ కి ఎదురుగా ఉన్న మైదానంలో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. కానీ అక్కడ దీక్ష చేయడానికి గుంటూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్ష వలన ట్రాఫిక్ సమస్య కలుగుతుందని అందుకే అనుమతించడం లేదని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి అక్కడ దీక్ష చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకి కూడా ముందే తెలుసు. కానీ పోలీసుల అనుమతి కోసం ఒక దరఖాస్తు పడేసి, వాళ్ళు అనుమతిపొందకుండానే వైకాపా నేతలు దీక్షకు ఏర్పాట్లు చేసుకుపోయారు. ఎన్నడూ లేని విధంగా వారు ఈ సారి వేదిక వద్ద భూమిపూజ కూడా చేసారు. ఈ దీక్షని విజయవంతం చేయాలనే ఉద్దేశ్యంతో జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా తిరుపతి, వైజాగ్ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులతో సమావేశమయ్యి తన దీక్షకు వారి మద్దతు కోరారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు అందరూ గుంటూరులోనే మకాం పెట్టి జగన్ దీక్షకు చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వారెవరూ ఊహించని విధంగా తెదేపా ప్రభుత్వం జగన్ దీక్షకు అనుమతి నిరాకరించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఆ దీక్ష ద్వారా ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు, వాటితో బాటే ఆత్మహత్యలు మొదలయ్యే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదీగాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రప్రభుత్వం విస్పష్టంగా చెపుతున్నప్పుడు, జగన్ మళ్ళీ ప్రత్యేక ఉద్యమాన్ని రాజేస్తే దాని వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చును. బహుశః అందుకే రాష్ట్ర ప్రభుత్వం జగన్ దీక్షకి అనుమతి నిరాకరించి ఉంటుందని భావించవచ్చును. వైకాపా నేతలు పోలీసులు అనుమతిస్తారనే ధీమాతో దీక్షకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటూ వెళ్లిపోయారే గానీ ఇలాగ ఆఖరు నిమిషంలో అనుమతి నిరాకరిస్తారని ఊహించకపోవడంతో సమస్య ఎదురయింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా చాల తెలివిగా ఎక్కడా బయటపడకుండా ఆఖరునిమిషం వరకు ఏమీ అనకుండా పోలీసుల చేత అనుమతి నిరాకరింపజేసి వైకాపా నేతలకి గట్టి షాక్ ఇచ్చింది. పోలీసులు అనుమతించకపోవడంతో ఇప్పుడు దీక్షని వాయిదా లేదా రద్దు చేసుకోవడం కష్టమే. వేరే ప్రాంతానికి మార్చినా అక్కడా ఇదే సమస్య ఎదురవవచ్చును. అలాగని బలవంతంగా దీక్షకు కూర్చొనే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కనుక ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు వైకాపా నేతలు. తమ దీక్ష మొదలు కాకముందే ప్రభుత్వం ఈవిధంగా భగ్నం చేసినందుకు వైకాపా నేతలు అందరూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అప్పుడే విరుచుకుపడుతున్నారు. కానీ ఈ సమస్యను వారు ఏవిధంగా అధిగమిస్తారో వేచి చూడాలి.