ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్టుమెంట్ మీడియా ముందు పరవు తీసుకుంటోంది. గుట్టుగా ఉండాల్సిన అంతర్గత విషయాలను ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ… పోలీస్ డిపార్టుమెంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నింటినీ ప్రజల ముందు పెడుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేసే క్రమంలో… ఇతర సీనియర్ ఐపీఎస్‌లు గతి తప్పిపోయారని.. బయటకు వస్తున్న సంచలన విషయాల నేపధ్యంలో… తాజాగా.. పోలీస్ డిపార్టుమెంట్ ఆయనపై ఎదురుదాడికి దిగుతోంది. పోలీస్ డిపార్టుమెంట్ తరపున అధికార ప్రతినిధిగా నియమితులైన డీఐజీ పాలరాజు.. ఈ రోజు రాసుకొచ్చిన స్టేట్మెంట్ను మీడియా ముందు చదివి వినిపించారు. ఇందులో ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయ పరమైన ఆరోపణలతో ఎదురుదాడి చేశారు.
వివేకా హత్య కేసు విషయాన్ని పోలీస్ అధికార ప్రతినిధి విచిత్రమైన కోణంలో ఆవిష్కరించారు. నాడు ఏబీ కనుసన్నల్లోనే వైఎస్ వివేకా హత్య దర్యాప్తు జరిగిందని ఆరోపించారు. ఏబీవీ సమాచారంతోనే నాడు చంద్రబాబు మీడియాతో మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. పోలీస్ అధికార ప్రతినిధికి అప్పటి సీఎం చంద్రబాబు అని గుర్తున్నట్లుగా లేదు. ఏబీవీ ఇంటలిజెన్స్ చీఫ్.. రాష్ట్రం ఏం జరిగినా .. రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇంటలిజెన్స్ చీఫ్ పై ఉంటుంది. అందులో తప్పేముందో కానీ.. డీఐజీ పాలరాజు ఏబీవీ తప్పు చేశారన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతే కాదు.. తన వద్దనున్న కీలక సమాచారాన్ని.. నాడే ఏబీ వెంకటేశ్వరరావు సిట్‌కు ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు. కానీ సీబీఐకి ఏబీవీ ఇచ్చిన లేఖలో… తాను సిట్‌కు అన్ని రకాల సమాచారాన్ని ఇచ్చానని స్పష్టంగా చెప్పారు. కానీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని కల్పించడానికి పోలీస్ శాఖ అధికార ప్రతినిధి… తన ప్రెస్‌మీట్ ద్వారా కల్పించే ప్రయత్నం చేశారు. దర్యాప్తు సమాచారాన్ని ఏబీవీ అందివ్వకపోవడం తప్పు కాదా అని కూడా ప్ఱస్నించారు.
అదే సమయంలో ఆధారాలు లేకున్నా జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్టు చేయాలని.. దర్యాప్తు అధికారి రాహుల్ దేవ్‌పై ఏబీవీ ఒత్తిడి తెచ్చారని.. అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నిబద్దత గల అధికారి కాబట్టి ఏబీవీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని డీఐజీ చెప్పుకొచ్చారు. నిజానికి నిందితులు ఎవర్నీ అరెస్ట్ చేయకపోవడం.. ముఖ్యంగా జగన్ కుటుంబసభ్యుల్ని అరెస్ట్ చేయకపోవడాన్ని డీఐజీ నిబద్ధగా చెబుతున్నారు. ఎవరైనా ఆ పోలీసులు ఆ స్పాట్లో ఉంటే.. సాక్ష్యాలు తుడిచేసిన వాళ్లని.. పోలీసుల్ని తప్పుదోవ పట్టించిన వాళ్లని అక్కడిక్కడే అరెస్ట్ చేస్తారు. అలా చేసింది వైఎస్ కుటుంబసభ్యులే. నిజాయితీగా పోలీసు అధికారులు ఎవరైనా అదే చేసి ఉండేవారు. కానీ అలా అరెస్ట్ చేయకపోవడమే నిబద్ధతగా పోలీసు అధికారప్రతినిధి గొప్పగా ప్రకటించుకున్నారు.
అదే సమయంలో ఏబీవీ కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను.. మీడియాకు వెల్లడించడం సమంజసం కాదని.. కృత్రిమ డాక్యమెంట్లు సృష్టించారన్న ఏబీ ఆరోపణలు నిరాధారమని డీఐజీ రాసుకొచ్చిన నోట్లో నుంచి చదివి వినిపించారు. ఏబీవీ ఎలా కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారో.. ఆ పత్రాలు కూడా సీఎస్‌కు తన లేఖతో పాటు పంపిన విషయాన్ని పోలీస్ అధఇకార ప్రతినిధి ప్రశ్నించారు. సహచర అధికారులపై ఏబీ ఆరోపణలు సరికాదని డీఐజీ వ్యాఖ్యానించారు కానీ.. సహచరుడై.. సీనియర్ డీజీ హోదాలో ఉన్న ఏబీవీపై… తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి… తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేయడం.. సహచర ఐపీఎస్ ఆఫీసర్లకు ఎందుకు తప్పుగా అనిపించలేదన్న ప్రశ్న ఇప్పుడు కొంత మంది అధికారుల్లో వినిపిస్తోంది.
మొత్తానికి పోలీసు శాఖ పరువు మొత్తం మీడియా ముందు పడింది. ఎప్పుడూ లేని విధంగా పోలీసులు … వర్గాలుగా విడిపోయారు. ప్రభుత్వం వారి మధ్య చీలిక తెచ్చి పావులుగా వాడుకుంటోంది. ఈ వివాదాలు.. ఇంతటితో సమసిపోయే అవకాశం కనిపించడం లేదు. పోలీసు శాఖ వ్యవహారాలు మొత్తం గుట్టు రట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.