ఊహించినట్లే నిన్న అర్ధరాత్రి దాటినా తరువాత పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేశారు. వారు మొదట జగన్ దీక్షను విరమించమని కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించడంతో ఆయనని బలవంతంగా అంబులెన్స్ లో ఎక్కించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సందర్భంగా వైకాపా నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ పోలీసులు వారిని అదుపు చేసి జగన్మోహన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించబోతునప్పుడు జగన్ తను దీక్షను కొనసాగించాలనుకొంటున్నానని తెలిపారు. కానీ ఇంకా దీక్ష కొనసాగిస్తే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అయినా జగన్ కొంత ప్రతిఘటించడంతో వైద్యులు ఆయనకి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేసారు. ఆ తరువాత జగన్ కి అన్ని పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కానీ మరో 24గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు జగన్ కి సూచించారు. జగన్ కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి చేరుకొన్నారు. ఈరోజు ఉదయం వైకాపా నేతలు గుంటూరులో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చిస్తారు.