వినేవాడుంటే… చెప్పే వాడికేముంది అన్నట్లుంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి. సీఐపై హత్యాయత్నం కేసు సహా ఎన్నికల అనంతర అల్లర్లలో నమోదైన కేసుల్లో జైల్లో ఉన్న పిన్నెల్లిని విచారిస్తున్న అధికారులకు ఆయన పొంతన లేని సమాధానాలిస్తున్నారని తెలుస్తోంది.
పోలింగ్ తర్వాత నేను అసలు గడపే దాట లేదు… సీఐపై హత్యాయత్నం ఎలా చేస్తా? నన్ను హౌజ్ అరెస్ట్ లో ఉంచితే కారంపూడికి ఎలా వెళ్తా అంటూ విచారిస్తున్న డీఎస్పీపైనే ఎదురు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల విచారణలో పిన్నెల్లి ఇలాంటి సమాధానాలతోనే టైం గడిపేస్తున్నారని పోలీసు వర్గాల సమాచారం.
ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు కోర్టు చెప్పిన విధంగా పిన్నెల్లిని విచారిస్తున్నారు. రెండోరోజు కోర్టు అనుమతితో దాదాపు 7గురు పోలీసు అధికారులు విచారిస్తూ, వీడియో రికార్డు కూడా చేశారు.
పిన్నెల్లి విచారణకు సహకరించటం లేదని… పిన్నెల్లిని విచారిస్తేనే మాచర్లలో జరిగిన కుట్ర కోణం బయటపడుతుందని, తనను మరికొన్ని రోజులు విచారించేందుకుఅనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరబోతున్నారు.