ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు… ఉద్రిక్తతలు, గొడవలను చూస్తే పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని అర్థం చేసుకోవచ్చు. పల్నాడులో టీడీపీ కార్యాలయాల్ని తగులబెట్టడం.. ప్రచారానికి వెళ్తున్న వారిపై దాడులు చేయడం దగ్గర్నుంచి ఒంగోలు బాలినేని రెండు రోజుల పాటు నిర్వహించిన ఆందోళనల్లో.. పోలీసులపై రుబాబు, ఆస్పత్రిదాడి వంటి ఘటనల్లో అసలు వ్యవస్థ అంటే వైసీపీ వారికి బయం లేదని తేలిపోయింది. చివరికి.. సీఎం భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ ఎగురవేస్తున్న ఇద్దరు పోలీసుల్ని వైసీపీ నాయకులు చితక్కొట్టిన ఘటన గుంటూరులో ఒక్క రోజు ముందే జరిగింది.
ఇక పెద్దిరెడ్డి సొంత సామ్రాజ్యంగా మార్చుకున్న పుంగనూరులో ఇతర పార్టీల వాళ్లు ప్రచారానికి వెళ్తే ఎదురవుతున్న పరిస్థితులపై వీడియోలు వచ్చినా.. చర్యలు శూన్యం. ఎన్నికల నిర్వహణ మొత్తం తమ కనుసన్నల్లో ఉండేలా చూసుకునే విషయంలో … వైసీపీ నేతలు చాలా ముందు చూపుతో వ్యవహరించారు. కొంత మందిని తొలగించినా.. మళ్లీ తమ వాళ్లే పోస్టుల్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రభావాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో ఎన్నికల నిర్వహణ కొన్ని గ్రామాల్లో తప్ప ప్రశాంతంగా జరిగిపోతుంది. కానీ ఈ సారి మాత్రం.. రావణకాష్టం చేయడానికి పాలకులే స్వయంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి మరీ ప్రయత్నిస్తున్నారని అర్థమైపోతుంది. ఇలాంటి సమయంలో మొత్తం బాధ్యత ఉన్న ఈసీ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. సమర్థులైన అధికారుల్ని పెట్టి.. ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేయాల్సి ఉంది. మరి ఈసీ ఏం చేయబోతోందో చూడాల్సి ఉంది.