తెలంగాణాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి న్యాయం చేయాలని కోరుతూ రెండు రోజులు దీక్షకి కూర్చొని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేగలిగారు. మల్లన్నసాగర్ భూసేకరణకి తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ప్రకారం కాకుండా 2013 భూసేకరణ చట్టప్రకారమే నిర్వాసితులకి నష్టపరిహారం, పునరావాస ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు తదితరులు ఆయన తెలంగాణా అభివృద్ధిని అడ్డుకొంటున్న ద్రోహిగా ముద్రవేసేందుకు ప్రయత్నిస్తూన్నప్పటికీ, నిర్వాసితులతో చర్చలకి సిద్దమని, రైతులు ఏ పద్ధతిలో తమ భూములు ఇవ్వదలచుకొంటే ఆ విధంగా ఇవ్వవచ్చని ప్రకటించడం గమనిస్తే తెలంగాణా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఒత్తిడి ఫలించిందని స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి ఒక్కరే కాకుండా కాంగ్రెస్ పార్టీ, భాజపా, తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు అందరూ కూడా మల్లన్నసాగర్ నిర్వాసితులకి అండగా నిలబడటంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
ఇందుకు ప్రతిగా తెరాస ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు పావులు కదిపింది. ఆయన నిన్న దీక్ష చేపట్టడానికి ముందు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావులని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడారని మన్నె గోవర్ధన్ అనే తెరాస నేత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దానిని స్వీకరించి పోలీసులు రేవంత్ రెడ్డిపై సెక్షన్స్ : 504, 290, 188 క్రింద కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు ఇద్దరూ కలిసి సాగునీటి ప్రాజెక్టుల పేరిట ఆంద్ర కాంట్రాక్టర్ లకు రూ. 56,500 కోట్లు దోచిపెడుతున్నారని, వారిరువురూ ఇచ్చే బీరు, బిర్యానికి ఆశపడి వారికి వంతపాడుతూ నిర్వాసితులకి అన్యాయం చేయడానికి సిద్దపడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణా సొమ్ముని దోచిపెడుతున్న మామాఅల్లుళ్ళు, మల్లన్నసాగర్ నిర్వాసితులకి 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఇమ్మంటే ఎందుకు సంకోచిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి వేసిన ఈ ప్రశ్న ఆలోచింపజేసేదిగా ఉందని అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన ఆవేశంతో ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడటంతో చేజేతులా ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లయింది. కానీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, మల్లన్నసాగర్ నిర్వాసితుల తరపున పోరాడుతున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చర్యలకి పూనుకొందనే భావన వ్యాపిస్తుంది. అప్పుడు నిర్వాసితుల దృష్టిలో రేవంత్ రెడ్డి హీరో అయిపోతారు. ప్రభుత్వమే ఆయనకి ఉచిత పబ్లిసిటీ, ప్రజల సానుభూతి కల్పించినట్లవుతుంది. కనుక ఆయనపై కేసు నమోదు చేసినప్పటికీ ఆయనని అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది.