చింతమనేని ప్రభాకర్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలి పెట్టారు భీమడోలు పోలీసులు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఓ కుట్ర ప్రకారం అరెస్ట్ చేశారని చింతమనేని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీలకు తెలియకుండానే తన అరెస్ట్ జరిగిందా అని ప్రశ్నించారు. తనను గంజాయి గురించి ప్రశ్నించారని.. కానీ నోటీసులు మాత్రం వేరేగా ఇచ్చారని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల ఎస్సైలకు తన మీద అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. విడుదలైన చింతమనేనని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పోలీసుల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ వ్యవహారం సంచలనం సృష్టించింది. కార్యకర్త ఇంట శుభకార్యానికి వెళ్లిన ఆయనను నర్సీపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. పైగా విశాఖ రూరల్ ఎస్పీ మావోయిస్టులు, గంజాయి అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేయడంతో ఏదో జరుగుతోందని టీడీపీ నేతలు అనుకున్నారు. రాత్రంతా విశాఖ పోలీసుల అదుపులోనేఉన్న చింతమనేనిని సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు స్టేషన్‌కు తీసుకు వచ్చారు. అక్కడ్నుంచి ఏలూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారన్న ప్రచారం జరిగింది.
ఏం జరిగిందో కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేస్తున్నట్లుగా చెప్పి పంపేశారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వలేదు. అప్పటికే ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున నేతలు చేరుకున్నారు. వారెవరూ బీమడోలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా అందరూ మండిపడ్డారు. డీజీపీకి లేఖ రాశారు. తప్పుడు కేసులు పెట్టిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.