తెలుగుదేసం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను కస్టడీలో పోలీసులు కొట్టారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. పట్టాభిని పోలీసులు కొట్టారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. కొట్టలేదని విజయసాయిరెడ్డి చెప్పాలని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, వైసీపీ వేర్వేరు కాదని ఆయన అన్నారు. తనకు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం ఉందని కానీ కొంత మంది తీరు వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ పైనే మరకలు పడుతున్నాయన్నారు.
నిజానికి పట్టాభి కస్టడీలో పోలీసులు తనను కొట్టలేదని కోర్టుకు చెప్పారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే .. రఘురామకృష్ణరాజు అనుభవంతో పోలీసులు తనను కొడతారన్న ముందు జాగ్రత్తతో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వీడియోలో చూపించారు. ఆ తర్వాత ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నోటీసుల్లో స్పష్టత లేకపోయినా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపించారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ ఇచ్చింది.
ఆ తర్వాత పట్టాభి మీడియాతో మాట్లాడలేదు. ఆయన మాల్దీవ్స్ వెళ్లిపోయారు. కానీ ఓ వీడియో అయితే విడుదల చేశారు. త్వరలో వస్తానని చెప్పారు. అయితే పోలీసులు తనతో ఎక్కడా అనుచితంగా ప్రవర్తించారని చెప్పలేదు. అయితే జైలు నుంచి విడుదలైన సమయంలో ఆయన కుంటుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాలను చూసే రఘురామకృష్ణరాజు కొట్టారని భావించి ఉంటారని అనుకుంటున్నారు. లేకపోతే అంతకు మించిన ఆధారాలుంటే .. తర్వాత ఈ వ్యవహారంపై ఆయన ఏదో ఒకటి చేయకుడా ఉండరని అంటున్నారు.