బడా హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు పడడం సహజం. అయితే ఈమధ్య హైదరాబాద్ పోలీసులు అందుకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ కాటమరాయుడు నుంచి నిన్నటి పైసా వసూల్ వరకూ ఈ సమస్యే ఎదుర్కొంది చిత్రసీమ. ఇప్పుడు జై లవకుశకూ అంతే! ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవకుశ. గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బుధవారం అర్థరాత్రి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్ షో పడిపోవాల్సిందే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా గట్టిపట్టుపట్టారు. నైజాం ఈ సినిమాని దిల్ రాజు కొన్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ ఎదురు లేదు. పర్మిషన్లు తేలిగ్గా వచ్చేస్తాయి.కాకపోతే.. ఈసారి లవకుశకు మాత్రం కష్టమవుతోంది. డీసీపీ సెలవులో ఉండడం, ఇన్ ఛార్జ్ డీసీపీ ఎటూ తేల్చకపోవడంతో ఫ్యాన్స్ షోకి అనుమతి వస్తుందా? రాదా? అనేది అనుమానంగా మారింది. హైదరాబాద్ బ్రమరాంబలో తెల్లవారుఝామున 3 గంటలకు ఫ్యాన్స్ షో వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్లు కూడా అమ్మేశారు. కానీ… అనుమతి మాత్రం రాలేదు. పైసా వసూల్లా 5 దాటాకే షో వేయాలని… పోలీసులు చెబుతున్నార్ట. సో.. లవకుశ ఫస్ట్ షో పడేదీ అప్పుడే కావొచ్చు.