ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాజపా ఎమ్మెల్యే గణేష్ జోషి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శక్తిమాన్ అనే పోలీసు గుర్రం నేడు మరణించింది. మార్చి 14వ తేదీన గణేష్ జోషి నేతృత్వంలో డెహ్రాడూన్లో భాజపా కార్యకర్తలు రావత్ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు గుర్రాలపై రాగా, గణేష్ జోషి శక్తిమాన్ అనే గుర్రంపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసారు. ఆ దాడిలో అది తీవ్రంగా గాయపడింది. దానికి ఆపరేషన్ చేసి ఒక కాలు కూడా తొలగించి దాని స్థానంలో ఒక కృత్రిమ కాలుని అమర్చారు. కానీ తీవ్రగాయాల కారణంగా అది ఈరోజు తుది శ్వాస విడిచింది. అది మళ్ళీ కోలుకోవాలని చాలా మంది ప్రజలు ప్రార్ధనలు కూడా చేసారు కానీ వారి ప్రార్ధనలు ఫలించలేదు.
మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తో సహా అనేకమంది నేతలు, జంతు ప్రేమికులు, ప్రజలు వచ్చి చనిపోయిన శక్తిమాన్ కి శ్రద్ధాంజలి ఘటించారు. అది తప్పకుండా కోలుకొని లేచి తిరుగుతుందని భావించామని కానీ దురదృష్టవశాత్తు మరణించిందని హరీష్ రావత్ బాధ పడ్డారు. చనిపోయిన శక్తిమాన్ కూడా రాష్ట్ర సేవలో ప్రాణాలు కోల్పోయిన ఒక వీర సైనికుడు వంటిదేనని రావత్ చెప్పారు.
నోరులేని మూగజీవి అని కూడా చూడకుండా అంత దారుణంగా కొట్టి దాని మరణానికి కారకుడయిన గణేష్ జోషి నేటికీ తన తప్పును ఒప్పుకోవడం లేదు..పశ్చాతాపపడటం లేదు. పైగా తనను అప్రదిష్ట పాలుచేసేందుకే హరీష్ రావత్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే శక్తిమాన్ కి సరయిన చికిత్స అందించకుండా చేసి దాని మరణానికి కారణమయ్యిందని ఆరోపిస్తున్నారు. గణేష్ జోషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంలో దానిపై విచారణ జరుగుతోంది. ఒక మనిషిని ఆ విధంగా కొట్టి చంపితే, దానిని హత్యగా భావించి చట్టప్రకారం శిక్షిస్తారు. కానీ గుర్రాన్ని హత్య చేస్తే దానికి చట్టం ఎటువంటి శిక్ష వేస్తుందో? అతను భాజపాకి చెందిన ఎమ్మెల్యే కనుక అసలు ఎటువంటి శిక్ష పడకుండానే తప్పించుకొంటారో? చూడాలి.