జగన్ రెడ్డి విశాఖ వస్తే చెట్లు కొట్టేసి.. డివైడర్లు తీసేసి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. డ్వాక్రా మహిళల్ని బలవంతంగా పిలిపిస్తారు. విపక్ష నేతలు వస్తే మాత్రం వారికి మద్దతుగా ఎవరూ రాకుండా పోలీసు నిబంధనలు అన్నీ పెడతారు. తాజాగా విశాఖలో జనసేన వారాహి యాత్రపై పోలసులు పలు రకాల ఆంక్షలు పెట్టారు. గురువారం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలురకాల ఆంక్షలతో అనుమతి ఇచ్చారు. పలు నిబంధనలు విధించారు.
ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని కండీషన్ విధించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘటనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల ఆంక్షల కారణంగా ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని జనసేన పార్టీ కోరింది. వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను జనసేనికులు పాటించాలని జనసేన ప్రకటన విడుదల చేసింది. క్రేన్లతో భారీ దండలు, గజమాలలు లాంటివి వేయవద్దని సూచించింది. యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదని, పవన్ కళ్యాణ్ భద్రతకు భగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
కాస్త తగ్గినా యాత్ర సాఫీగా సాగడం ముఖ్యమని.. లేకపోతే వాళ్లే దాడులు చేసి.. కేసులు పెట్టి యాత్రను ఆపేందుకు ప్లాన్ చేస్తారని జనసేన వర్గాలు అలర్ట్ గా ఉండాలని నిర్ణయించుకున్నాయి.