పారిస్ దాడుల తర్వాత ఐరోపా దేశాల ఆలోచన తీరే మారిపోయింది. ఇంత కాలం అక్కడ హాయిగా నివసించిన ముస్లింలకు కష్టకాలం మొదలైంది. ఐసిస్ ముష్కరుల పుణ్యమా అని, యూరప్ లోని లక్షల మంది ముస్లింలు ఇప్పుడు సోదాలు, దాడులు, అవసరమైతే ఎన్ కౌంటర్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పటికే బెల్జియంలో, ముఖ్యంగా రాజధాని బ్రస్సెల్స్ లో గల్లీ గల్లీలో ఇల్లిల్లూ సోదాలు చేస్తున్నారు. నగరాన్ని చక్రబంధం చేసిన పోలీసులు, ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసి, పారిస్ దాడులకు సహకరించిన అనుమానితుల కోసం గాలిస్తున్నారు. పైగా, బ్రస్సెల్స్ లో పారిస్ తరహా దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా సంస్థలు దీంతో హెచ్చరించాయి. దీంతో దేశంలో అప్రమత్తత స్థాయిని హైఅలర్ట్ నుంచి హయ్యెస్ట్ అలర్ట్ కు పెంచారు. భారీగా భద్రతాదళాలను మోహరించారు.
ఫ్రాన్స్ లో మూడు నెలల ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం, భద్రతాదళాలకు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా సోదా చేయడానికి, ఇళ్లలో తనిఖీలు చేయడానికి, అవసరమైతే ఐసిస్ ఉగ్రవాది అనే అనుమానంతో కాల్చి చంపడానికి కూడా సైన్యానికి, పోలీసులకు అవకాశం లభించింది. దీంతో, అక్కడి ముస్లింలు భయపడుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో ఎన్ కౌంటర్లు జరుగుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఫ్రెంచి పౌరులు మాత్రం మానవహక్కులంటూ మీనమేషాలు లెక్కించకుండా, అనుమానితులను కాల్చి పారేయాలని అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ లోని దాదాపు 50 లక్షల మంది ముస్లింలకు ఇక క్షణమొక యుగంగా భయం భయంగా బతకాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఎవరో కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి, తాము బలి కావాల్సి వస్తుందంటున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం పగతో రగిలిపోతోంది. ఈ అభిప్రాయాలేవీ పట్టించుకునే స్థితిలో లేదు. సిరియాలో వైమానిక దాడులను కొనసాగిస్తోంది.
ఐరోపాలోని ఇతర దేశాల్లోనూ ఐసిస్ తో పాటు ముస్లింలపై వ్యతిరేకత పెరుగుతోంది. సిరియా శరణార్థులను లక్షల సంఖ్యలో అనుమతించిన దేశాల్లో దాడుల భయం పొంచి ఉంది. శరణార్థుల మాటున ఉగ్రవాదులు ప్రవేశించి ఉంటారనే భయం వెంటాడుతోంది. కాబట్టి అక్కడ కూడా ముస్లింలపై నిఘా పెంచుతున్నారు. కొన్ని శతాబ్దాలుగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఐరోపా దేశాల్లో, ఉన్నత జీవన ప్రమాణాలతో బతికిన ముస్లింలు ఇప్పుడు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రపంచాన్ని జయిస్తామని ప్రగల్భాలు పలికే ఐసిస్ ముష్కరుల కిరాతక చర్యల వల్ల, వారి మతానికే చెందిన లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. అయినా, ఐసిస్ ఉగ్రవాదులు మాత్రం ఇంకా దాడులు చేస్తామంటూ పాశ్చాత్య దేశాలను మరింత రెచ్చగొడుతున్నారు.