డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు హైకోర్టుకు చేరింది. వీడియో సాక్ష్యాలతో సహా… టీడీపీ నేత వంగలపూడి అనిత.. హైకోర్టుకు లేఖ రాశారు. చింతా వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా పిటిషన్ వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు…డాక్టర్ సుధాకర్‌ను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించింది. డాక్టర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా అర్థనగ్నంగా నడిరోడ్డుపై అరెస్ట్ చేశారని.. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని పిటిషర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాడి చేసిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
డాక్టర్ సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరు జాతీయ మీడియాలో హైలెట్ అయింది. ఓ వైద్యుని పట్ల పోలీసులు అంత దారుణంగా వ్యవహరించడం ఏమిటని విస్మయం వ్యక్తం అయింది. డాక్టర్ సుధాకర్ ఎక్కడా… పోలీసులపై తిరగబడటం కానీ.. తప్పించుకునే ప్రయత్నం కానీ చేసినట్లుగా.. వీడియోలు లేవు. ఆయన న్యూసెన్స్ చేసి ఉంటే.. అంత మాత్రం దానికి.. ఇంత దారుణంగా ఎలా ట్రీట్ చేస్తారన్న జాతీయ మీడియా వర్గాల్లోనూ నడిచింది. పలు మీడియా చానళ్లు.. పోర్టళ్లు.. డాక్టర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ.. కథనాలు ఇచ్చాయి. ఆయనకు మానసిక రోగం అందంటూ మెంటల్ ఆస్పత్రికి పంపించడం పైనా ప్రశ్నలు వస్తున్నాయి.
మద్యం మత్తులో ముఖ్యమంత్రిని.. ప్రధానమంత్రిని డాక్టర్ సుధాకర్ విమర్శించారంటూ.. పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. అయితే.. విమర్శించినంత మాత్రాన.. అలా దాడి చేస్తారా.. దానికి చట్టబద్ధంగా తీసుకునే చర్యలు అంత దారుణంగా ఉంటాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ హైకోర్టుకు హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే.. ఇప్పుడు మళ్లీ డాక్టర్ సుధాకర్ విషయంలో… విశాఖ పోలీసుల తీరు వివాదాస్పదమయింది. వ్యవహారం హైకోర్టుకు చేరింది. డాక్టర్ సుధాకర్ తప్పు చేశారని పోలీసులు సమర్థించుకున్నా… ఆయనతో వ్యవహరించిన తీరు మాత్రం… సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే హైకోర్టు విచారణపై ఆసక్తి వ్యక్తమవుతోంది.