చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓంప్రతాప్ మృతి విషయంలో ఆధారాలు ఇవ్వాలంటూ… పోలీసులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. అదీ కూడా సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం.. ఇచ్చారు. నోటీసు అందిన వారం రోజుల లోపు నేరుగా తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని మదనపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి పేరు మీదుగా నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో.. “పెద్దిరెడ్డి బెదిరింపులతోనే.. డీజీపీకి చంద్రబాబు లేఖ” అనే పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.
అందులో ఆరోపించినవాటికి ఆధారాలు కావాలని… లేఖలో పోలీసులు పేర్కొన్నారు. గత వారం.. తెలుగుదేశం పార్టీ నేతలు.. దళిత యువకుడు ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. అదే రోజున.. ఎస్పీ ఓంప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడే పెద్దిరెడ్డి బెదిరింపుల వల్లే ఓం ప్రతాప్ చనిపోయాడని ఆరోపించిన వారికి నోటీసులు పంపుతామని హెచ్చరించారు. ఆ ప్రకారం.. చంద్రబాబుకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే.. చంద్రబాబు నేరుగా.. డీజీపీకే లేఖ రాశారు.
డీజీపికి లేఖ రాసినట్లుగా పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు పంపడం… ఈ మొత్తం వ్యవహారంలో ఓ ట్విస్ట్. ఓం ప్రతాప్ మృతి వ్యవహారంలో ఇప్పటికీ.. చిత్తూరు జిల్లాలో అనేకరకాల చర్చోపర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని దూషించడమే… ఆయన మరణానికి కారణం అన్న చర్చ జరుగుతోంది. తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సమయంలో.. పోలీసులు ఆధారాలు అంటూ.. ప్రతిపక్ష నేతకు నోటీసులు జారీ చేయడం..జకీయ ఆరోపణలకు పోలీసులు స్పందించడం.. వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.