రఘురామపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రఘురామను సీఐడీ ఆఫీసుకు తీసుకువచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రైవేటు వ్యక్తిగా కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తిని గుర్తించారు. అతను రఘురామ చాతిపై కూర్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ ఎమ్మెల్యేకు ఆయన దగ్గర మనిషిగా పేరు పొందారు. ఈ తులసిబాబుపై రఘురామ ఆరోపణలు చేసినప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది.
పోలీసు కాని వ్యక్తి రఘురామ వంటి వీఐపీని అరెస్టు చేసినప్పుడు కస్టడీ రూమ్ లోకి ఎలా వెళ్లాడని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఫోన్ కాల్ రికార్డులు.. ఆ నాటి సీఐడీ ఆఫీసు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత పోలీసులు నిజమేనని నమ్ముతున్నారు. అందుకే ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు. మూడో తేదీన ఒంగోలులో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఒంగోలు ఎస్పీ ఈ కేసు విచారణాధికారిగా ఉన్నారు.
కామేపల్లి తులసి బాబు సస్పెండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. సునీల్ కుమార్ ఏ మతపరమైన స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని అంటున్నారు. ఆయన ద్వారా గుడివాడ ఎమ్మెల్యేకు దగ్గరయ్యారని భావిస్తున్నారు. తులసీబాబుకు నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.