మహిళలు అపర కాళికలయ్యారు. రక్తం వచ్చేలా పోలీసులు కొట్టినా వెనక్కి తగ్గలేదు. అడ్డంగా ముళ్ల కంచెలు వేసిన ముందుకే వెళ్లారు. మగ పోలీసులు చేతులు వేసినా… తిప్పికొట్టారు. బస్సుల్లో కుక్కి పోలీస్స్టేషన్లకు తరలించినా.. తగ్గలేదు. రాజధాని ఉద్యమంలో ఈ రోజంతా మహిళలు.. తమ పోరాటాన్ని చూపించారు. ఉదయమే.. వారు శంకుస్థాపన జరిగిన ప్రదేశం నుంచి.. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి పాదయాత్రగా వెళ్లి.. ముడుపులు కట్టాలనుకున్నారు. కానీ ఇదేదో పెద్ద నేరమైనట్లుగా పోలీసులు..ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకున్నారు. మహిళల్ని ఇంట్లో నుంచి రానివ్వలేదు. బలవంతంగా వచ్చిన మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. రాజధాని గ్రామాల్లో పలు చోట్ల మహిళలపై లాఠీ చార్జీ జరిగింది. చాలా మంది దెబ్బలు తరిగి రక్తం కూడా వచ్చింది. విజయవాడలోనూ అదే పరిస్థితి. మహిళలని కూడా చూడకుండా పోలీసులు రక్తం చిందేలా కొట్టారు. అరెస్టులు చేశారు. కానీ ఎక్కడా మహిళలు వెనక్కి తగ్గలేదు.
మహిళలపై పోలీసుల దాష్టీకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మహిళా కమిషన్ కూడా.. సుమోటోగా స్పందించింది. రేపు నిజ నిర్ధారణ కమిషన్ను అమరావతికి పంపుతున్నట్లుగా మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ .. ప్రకటించారు. పోలీసులు అత్యంత అసభ్యకరంగా మాట్లాడుతున్న వైనం.. శాంతియుత ప్రదర్శనలపైనా దాడులకు పాల్పడుతున్న వ్యవహారంపై.. ట్విట్టర్లో రాజధాని మహిళలు.. వీడియోలను పోస్ట్ చేశారు. దీనిపై రేఖా శర్మకు స్పష్టమైన సమాచారం ఉండటంతో.. పోలీసులు దాష్టీకాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. నిజనిర్ధరణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
రాజధాని గ్రామాల్లో పోలీసుల వ్యవహారశైలి.. అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. మహిళా ఆందోళన కారులపై కూడా.. ధర్డ్ డిగ్రీని ప్రయోగించేందుకు వెనుకాడటం లేదు. వారిపై.. అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. మహిళా పోలీసులు కూడా.. ఈ విషయంలో… ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పై అధికారుల నుంచి.. తీవ్రమైన ఒత్తిడి వస్తూండటంతో.. క్షేత్ర స్థాయి అధికారులు కూడా.. మహిళలపై లాఠీలను ఎత్తడానికి కూడా వెనుకాడటం లేదు. మొత్తానికి ఓ శుక్రవారం.. జగన్ కోర్టుకు వెళ్తే.. అదే రోజు.. పోలీసులు మహిళలపై విరుచుకుపడ్డారు.