తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. పట్టపగలు హత్యలు జరిగిపోయాయి. హైదరాబాద్ లో రెండు రోజుల వ్యవధిలో ఐదు హత్యలు జరిగాయని ఇదేంటని గగ్గోలు రేగితే… హడావుడి చేశారు. కానీ హత్యలు తగ్గలేదు. మంగళవారం అర్థరాత్రి బేగంపేట పాటిగడ్డలో మరో హత్య జరిగింది., ఒక్క హైదరాబాద్ కాదు.. తెలంగాణ మొత్తం ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదని రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని బీఆర్ఎస్ నేతలు వెంటనే విమర్శలు కూడా ప్రారంభించారు.
అసలు పోలీసు వ్యవహారాల్లోనూ గందరగోళం ఏర్పడింది. హత్యలు జరిగిపోతున్నాయని దుకాణాలన్నీ పదిన్నరకే మూసేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారని పోలీసు వర్గాలు ప్రచారం చేశాయి. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాక ముందే మీడియాకు లీకులిచ్చి కొన్ని చోట్ల దుకాణాల్ని పదిన్నరకే బలవంతంగా మూసివేయించారు. వివాదం కావడంతో అబ్బే అలాంటిదేమీ లేదని… అధికారిక ప్రకటన చేశారు. ఇలాంటి వ్యవహారాలతో పోలీసుల పని తీరు ఎంత నాసిరకంగా మారిపోతోందో చెప్పాల్సిన పని లేదు.
మరో వైపు రాజకీయ పోలీసింగ్ చేసే విషయంలో కొంత మంది వివాదాలు సృష్టిస్తున్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలు, ఏపీకి చెందిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు పరుగులు పెడుతున్నారు. కరెంట్ కోత ల విషయంలో ఓ మహిళా జర్నలిస్టు విషయంలో పోలీసులు చేసిన అతి ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేసింది. అవినీతికి మారుపేరుగా ముద్రపడిన ఓ ప్రముఖ టీవీ యాంకర్ తన గుట్టు బయటపెడుతున్నారని ఫిర్యాదు చేస్తే చాలు ఎఫ్ఐఆర్ పెట్టేసి నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి వాటిలో మాత్రం దూకుడుగా ఉంటున్నారు.
లా అండ్ ఆర్డర్ పర్ ఫెక్ట్ గా ఉండి.. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే ప్రభుత్వంపై సానుకూలత ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇదేమీ నిధులతో కూడిన విషయం కాదు. కేవలం పాలనకు సంబంధించినది.. పాలనా సామర్థ్యానికి సంబంధించినది.