సీపీఎస్ ఉద్యోగులు మిలియన్ మార్చ్‌కు పిలుపునిస్తే ప్రభుత్వం నెల రోజుల ముందు నుంచే కంగారు పడుతోంది. గత పదిహేను రోజులుగా సీపీఎస్ ఉద్యోగులుకు పోలీసులను పంపి నోటీసులు ఇస్తోంది. ఆ నోటీుల్లో బహిరంగ బెదిరింపులు ఉన్నాయి. అయినా సరే ఉద్యోగులు వెల్లువలా వస్తారని భయపడుతోంది. అందుకే విజయవాడ చుట్టూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఉద్యోగ సంఘ నేతల ఫోన్లపై పూర్తి స్థాయిలో నఘా ఉంచారు.
అంతే కాదు.. ఒకటో తేదీకి ఇంకా ఐదు రోజులు ఉండగానే విజయవాడను పోలీసుల మయం చేశారు. విజయవాడ, గుంటూరుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని లాడ్జిలు.. హోటల్స్ అన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. కొత్త వాళ్లకి ఎవరికీ రూములివ్వొద్దని ఆదేశిస్తున్నారు. ఎవరైనా వచ్చి ఉంటే.. వారికి భయం కల్పించేందుకు భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్ ను కూడా విజయవాడలో నిర్వహించారు.తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి బీఆర్టీఎస్ రోడ్ వరకు పోలీసులు ఆయుధాలతో చేసిన ప్రదర్శన .. ఏదో జరగబోతోందన్న అభిప్రాయాన్ని .. భయాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు.
ఫ్రిబ్రవరి నెలలో జరిగిన ఉద్యోగ సంఘాల ఛలో బెజవాడ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సారి అలాంటిది జరిగితే పరువు పోతుందని ప్రభుత్వం అనుకుంటోంది. అసలు సీపీఎస్ ఉద్యోగులు.. అసలు ముట్టడి కోసం తాడేపల్లి వెళ్లనున్నారు. సీఎం ఇంటికే వెళ్తామంటున్నారు. అందుకే పోలీసులు మరింత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం ఇంటి వైపు ఎవర్నీ పోనివ్వకుండా ఇప్పటి నుంచే ఆంక్షలు అమలు చేస్తున్నారు.