అమరావతికి భూములిచ్చిన పాపానికి దొంగల్లా చూస్తారా..? అంటూ రాజధాని రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం… రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ… ఆధారాలు సేకరించేందుకు రైతులను హరాస్ చేస్తూండటమే. సీఐడీ పోలీసులమంటూ అమరావతికి భూములిచ్చి రైతుల ఇళ్లలోకి సీఐడీ అధికారులు దూసుకొచ్చేస్తున్నారు. పోలీసు అనే స్టిక్కర్ అంటించిన కారు ఇంటి ముందు ఆగితే.. చాలా మందికి టెన్షన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి చూసిన వారు … ఇంకా ఎక్కువ టెన్షన్ పడక తప్పదు. దీన్ని మరింత పెంచేలా.. అమరావతిలో రైతుల ఇళ్లలో సీఐడీ అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజధాని రైతుల కులాల్ని తెలుసుకుంటున్న సీఐడీ పోలీసులు..!
రాజధాని భూముల్లో అక్రమాలంటూ.. ప్రభుత్వం సీఐడీ, విజిలెన్స్, రెవిన్యూ .. ఇలా విచారణకు అవకాశం ఉన్న అన్ని విభాగాలతోనూ విచారణ చేయిస్తోంది. నాలుగు నెలలు దాటిపోయినా… తమ దగ్గర పూర్తి సమాచారం, డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఫలానా అక్రమం జరిగిందనే ఆధారం కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు… క్షేత్ర స్థాయిలో విచారణ అంటూ.. సీఐడీ అధికారులను.. రైతులపైకి పురికొల్పారు. వారు రైతుల ఇళ్లకు వెళ్లి.. పోలీసుల పేరుతో.. హంగామా చేస్తున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అంతే కాదు.. కులం విషయం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏ కులమో అడిగి మరీ నోట్ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగులు .. ఇలా … అవసరం లేని విషయాలన్నింటినీ నమోదు చేసుకుంటున్నారు.
ఏదో నేరం చేసినట్లుగా రైతులతో సీఐడీ పోలీసుల ప్రవర్తన..!
రైతుల ఇళ్లలో సీఐడీ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు… చర్చనీయాంశం అవుతోంది. అమరావతికి భూములివ్వడమే… వారు చేసిన పెద్ద నేరం అన్నట్లుగా.. వారిని ఎవరూ కాపాడలేరన్నట్లుగా… సీఐడీ అధికారులు.. మాటలు, ప్రవర్తనతో.. రైతులను భయపెడుతున్నారు. నిజానికి అసలు రైతుల వద్దకు వెళ్లాల్సిన అవసరం సీఐడీ అధికారులకు లేదు. ఎందుకంటే… ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే మొత్తం అధికారం ఉంది. ప్రతి గజానికి ఓనర్ ఎవరో డాక్యుమెంట్ సహితంగా ప్రభుత్వం చేతుల్లో ఉంది. లావాదేవీలు ఎవరెవరరి మధ్య నడిచారో.. రికార్డెడ్ సాక్ష్యాలు ఉంటాయి. ఆ రైతులు ఆధార్ కార్డులు.. పాన్ కార్డులు అన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. కానీ.. ఇప్పుడు.. కేవలం.. రైతుల్ని బెదరగొట్టడానికి మాత్రమే… ప్రభుత్వం.. సీఐడీ అధికారులను రైతుల ఇళ్లకు పంపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజధాని రైతులను దొంగల్లా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు..?
సీఐడీ అధికారుల వ్యవహారం రాజధాని గ్రామాల్లో ఇప్పుడు.. హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడం… అమరావతిని తరలించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతూండటం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు.. తమనే దొంగలుగా చూస్తూ.. ఇళ్లకు పోలీసుల్ని పంపుతూండటంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు రైతుల్లో ప్రారంభమయ్యాయి. అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన వారి వద్దకు వెళ్తే… వివరాలు తెలుసుకుంటున్నారని అనుకోవచ్చు.. కానీ వంశ పారంపర్యంగా.. పొలాలు తమకు వచ్చిన వారి ఇళ్లకు.. వెళ్లి కూడా.. సీఐడీ అధికారులు పాన్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకోవడం సంచలనం అవుతోంది. తమను దొంగల్లా చూస్తూ.. వివరాలు నమోదు చేసుకోవడం… రైతుల్ని అసహనానికి గురి చేస్తోంది. ప్రభుత్వం తీరుపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.