ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యంత సిన్సియర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటి పక్కన జరిగిన ఓ అత్యాచార కేసులో నిందితుడైన వెంకటరెడ్డిని ఇంత వరకూ పట్టుకోలేకపోయిన పోలీసులు … పట్టిస్తే డబ్బులిస్తామంటూ పేపర్ ప్రకటనలు చేస్తున్నారు. కానీ టీడీపీ నేతల ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం అర్థరాత్రుళ్లు.. తెల్లవారుజామున వెళ్లిపోతున్నారు. గతంలో ఉదయమే కాకినాడ నుంచి పొన్నూరు వెళ్లిన పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఆర్థరాత్రి విశాఖ పోలీసులు గుటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద హంగామా సృష్టించారు.
నోటీసులు ఇవ్వడానికి అర్థరాత్రి నిద్ర లేపాలా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ పోలీసులకు అవేమీ పట్టలేదు.తమ డ్యూటీ తాము చేయడానికి వచ్చామని చెప్పుకున్నారు. దీంతో ఆశ్చర్యపోవాల్సిన వంతు టీడీపీ నేతలకు ఎదురయింది. నక్కా ఆనందబాబుకు నోటీసులు ఎందుకంటే .. రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ ఇతర అంశాలపై వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడమే. ఆ ఆరోపణలు చేసినందుకు సాక్ష్యాలు ఇవ్వాలంటూ ఇలా నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు.
పోలీసులు అసలు నేరాలను పక్కన పెట్టి ఇలా రాజకీయ డ్యూటీలు చేయడం వల్లే ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నిందితుల్ని పట్టుకోలేక పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని.. నోటీసులు ఇవ్వడానికి మాత్రం అర్థరాత్రి .. అపరాత్రి వస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఏపీ పోలీసులకు ఇవన్నీ కామన్ అయిపోయాయి. వారికి వచ్చే ఆదేశాల ప్రకారం వారు చేస్తున్నారు.